టీమ్‌ఇండియా టీ20 నూతన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తొలి సిరీస్‌లోనే రాణించాడు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కెప్టెన్సీతో న్యూజిలాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. దీంతో భారత్ గతేడాదిలాగే ఈసారి కూడా పొట్టి ఫార్మాట్‌లో కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి చిత్తుగా ఓడించింది. అయితే, రోహిత్ మూడో టీ20లో విజయం సాధించాక ట్రోఫీ అందుకున్న (Rohit Sharma Trophy Collection) అనంతరం.. దాన్ని తీసుకెళ్లి నేరుగా కొత్త ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్‌కు అందజేశాడు. ఇదివరకు మాజీ సారథులు (MS Dhoni Trophies) మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ (Virat Kohli Trophy Collection) సైతం ఏదైనా ట్రోఫీ గెలిస్తే యువ ఆటగాళ్ల చేతులకు ఇవ్వడం మనకు తెలిసిందే. దీంతో ఆ సంప్రదాయాన్ని హిట్‌మ్యాన్ కూడా కొనసాగించి అందరి చేతా ప్రశంసలు పొందుతున్నాడు.
మూడో మ్యాచ్‌లోనూ (India vs New Zealand T20) టాస్ గెలిచిన టీమ్‌ఇండియా ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్ (56; 31 బంతుల్లో 5x4, 3x6), ఇషాన్ కిషన్ (29; 21 బంతుల్లో 6x4) శుభారంభం చేయగా.. శ్రేయస్ (25), వెంకటేశ్ అయ్యర్(20), హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21) ధాటిగా ఆడి జట్టుకు 184/7 మంచి స్కోర్ అందించారు. అనంతరం అక్షర్ పటేల్ 3/9 తన బౌలింగ్‌తో మాయాజాలం చేయడం వల్ల కివీస్ టాప్ ఆర్డర్ కూలిపోయింది. తర్వాత మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఆ జట్టును 111 పరుగులకే ఆలౌట్ చేశారు. గప్తిల్ (51; 36 బంతుల్లో 4x4, 4x6) రాణించాడు. దీంతో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించి 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ట్రోఫీని తీసుకెళ్లి యువకులకు ఇవ్వడం వల్ల అభిమానులంతా రోహిత్‌ను ధోనీ, కోహ్లీతో పోలుస్తున్నారు.
'ప్రణాళిక ప్రకారం ఆడాం'
మ్యాచ్ అనంతరం విజయం పట్ల స్పందించాడు (Rohit Sharma News) రోహిత్ శర్మ. "మేం ఓం ప్రణాళిక ప్రకారం ఆడాం. మిడిల్ ఓవర్లలో ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ లోయర్ ఆర్డర్.. ఇన్నింగ్స్‌ను ముగించిన తీరు సంతోషాన్నిచ్చింది. హర్షల్ చివరి రెండు మ్యాచ్‌ల్లో చక్కగా రాణించాడు. స్పిన్నర్లు సిరీస్ ఆసాంతం మెరుగైన ప్రదర్శన చేశారు. అశ్విన్, అక్షర్, చాహల్ రాణించారు. వెంకటేశ్ అయ్యర్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. అతడు మరింత ఉపయుక్తమైన బౌలర్ అవుతాడు. చాలా జట్లు లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్నాయి. నంబర్ 8, 9 కీలక పాత్ర పోషిస్తున్నారు. హర్షల్ మంచి బ్యాటర్. దీపక్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని శ్రీలంకలో చూశాం" అని రోహిత్ అన్నాడు.