Ravi Shastri on Chahal Incident: టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు కొన్నేళ్ల కింద ఎదురైన ఘటనపై పలువురు క్రికెట్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఐపీఎల్లో తాను ముంబయి ఇండియన్స్‌కు ఆడే తొలి రోజుల్లో ఓ ప్లేయర్ తప్పతాగి తనను 15వ అంతస్తు నుంచి వేలాడదీశాడని చాహల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కొంచెెం అటూఇటైనా తను కింద పడిపోయేవాడినని అన్నాడు. దీనిపై స్పందించిన టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.. ఆ నేరానికి పాల్పడిన క్రికెటర్ సమీప భవిష్యత్తులో మైదానంలోకి అడుగుపెట్టనీయొద్దని సూచించాడు. ఇది చిన్న విషయం ఏమాత్రం కాదని అన్నాడు.
''ఇలాంటి ఘటనను చూడటం నాకు ఇదే తొలిసారి. ఇది చిన్న విషయం కాదు. చాహల్‌కు ఎదురైనటువంటి ఘటన ఈ రోజుల్లో జరిగితే.. ఆ వ్యక్తిపై జీవితకాల నిషేధం పడేది. వీలైనంత తొందరగా పునరావాస శిబిరానికి పంపేవారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో నాకు తెలియదు. అతడు ఏ స్థితిలో ఉన్నాడో నాకు తెలియదు. కానీ.. ఒకరి జీవితం ప్రమాదంలో ఉంటే అది ఎప్పటికీ ఫన్నీ కాదు.''
- రవిశాస్త్రి, టీమ్ఇండియా మాజీ కోచ్