Usman Ghani Retirement : అఫ్గానిస్థాన్ క్రికెట్లో స్టార్ ఓపెనర్‌గా సెన్సేషన్ సృష్టించిన ఉస్మాన్ ఘని ఇటీవలే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మేనేజ్మెంట్తో పాటు సెలక్షన్ కమిటీలో మార్పు వచ్చేంతవరకు అతను క్రికెట్‌కు దూరంగా ఉంటానంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్దలపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్స్ చేశాడు. ఉస్మాన్ ఘని తీసుకున్న ఈ నిర్ణయంతో అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
"అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాకే అఫ్గానిస్థాన్ క్రికెట్ నుంచి విరామం తీసుకుందామని నిర్ణయించుకున్నాను. అవినీతి కోరల్లో చిక్కుకున్న అఫ్గాన్ క్రికెట్ బోర్డు పనితీరు నన్ను ఆటకు దూరంగా ఉండేటట్టు చేసింది. కొంతకాలం పాటు ఆటకు దూరంగా ఉంటానేమో కానీ.. ఆటపై పట్టు కోల్పోకుండా నా హార్డ్ వర్క్‌ను కొనసాగిస్తూనే ఉంటా. బోర్డులో సరైన మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ వచ్చినప్పుడే గర్వంగా జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాను. అప్పటివరకు నా దేశం కోసం ఆడేందుకు ఎదురు చూస్తూనే ఉంటా. అనేకసార్లు బోర్డు పెద్దలను కలిసేందుకు ప్రయత్నించాను.. ఏసీబీ ఛైర్మన్ అందుబాటులో లేకపోవడం వల్ల కలవలేకపోయాను. అంతేగాక నన్ను అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పించడంపై చీఫ్ సెలెక్టర్ నుంచి ఇప్పటివరకు సరైన సమాధానం కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక ఆట నుంచి నేను పాక్షిక విరామం తీసుకున్నాను. "