ACC Emerging Asia cup 2023 : ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మెన్స్ ఎమర్జింగ్ కప్ (వన్డే)లో భారత్ యువ జట్టు అదరగొట్టింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ శతకంతో (110 బంతుల్లో 104 పరుగులు) మెరవడం వల్ల టీమ్ఇండియా 205 పరుగుల లక్ష్యాన్ని 36.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఏ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం టీమ్ఇండియా ఏ, బంగ్లాదేశ్ ఏతో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. సెంచరీతో కదం తొక్కిన సాయి సుదర్శన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
205 పరుగుల ఛేదనలో భారత్ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 20 నిరాశపర్చినా.. మరో ఎండ్‌లో సాయి సుదర్శన్ ఎక్కడా తగ్గలేదు. ఆచి.. తూచి ఆడుతూ వీలుచిక్కినప్పడల్లా బౌండరీలు బాదాడు. అతడికి వన్ డౌన్లో వచ్చిన నికిన్ జోస్ (53)తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకంగా మారాడు సుదర్శన్. కాగా లిస్ట్ ఏ కెరీర్లో సుదర్శన్‌కు ఇది నాలుగో శతకం.