ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు ఒక్కచోటికి చేరారు. బ్యాటింగ్‌తో మాయాజాలం చేసే మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. క్రికెట్ దైవం సచిన్ తెందూల్కర్‌ను కలిశాడు. ఈ విషయాన్ని ఏబీ ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు. సచిన్‌ను కలవడానికి ముందు, తర్వాత ఇన్‌స్టాలో పోస్టులు పెట్టాడు.
"ఉత్సాహం పట్టలేకపోతున్నా. సచిన్‌ను కలిసేందుకు ఎదురుచూస్తున్నా. నేను ఎంతో ఆరాధించేవారిలో ఆయన ఒకరు. క్రికెట్ ఆడే సమయంలో ఆయన ప్రదర్శించిన నైపుణ్యం అసాధారణం. అప్పటికి, ఇప్పటికి ఏమీ మారలేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆయన స్ఫూర్తినిస్తున్నారు. నాకు కూడా" అంటూ సచిన్‌తో మీటింగ్‌కు ముందు డివిలియర్స్ పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన సచిన్.. తనకూ డివిలియర్స్ పట్ల అదే విధమైన గౌరవం ఉందని చెప్పాడు.
'ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది'.. సచిన్‌తో మీటింగ్‌పై డివిలియర్స్
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాలు కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. సచిన్ తెందూల్కర్, ఏబీ డివిలియర్స్ కలిసి కాసేపు కాలక్షేపం చేశారు. దీనిపై ఏబీ డివిలియర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు.
మీటింగ్ పూర్తైన తర్వాత మరో పోస్ట్ చేసిన ఏబీ.. తెందూల్కర్‌తో గడిపిన క్షణాల గురించి వెల్లడించాడు. "ఈయనతో కొన్ని గంటలు గడిపాను. సచిన్‌ను ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నా. కానీ, ఆయన చెప్పిన దాన్ని వింటూ అవన్నీ మననం చేసుకోవడానికే నా సమయం అయిపోయింది. ఎంత అనుభవజ్ఞుడు. నాకు సమయం ఇచ్చిన 'మాస్టర్ బ్లాస్టర్'కు ధన్యవాదాలు" అంటూ ఇన్‌స్టాలో మరో పోస్ట్ పెట్టాడు.
అయితే, వీరిద్దరూ ఎందుకు కలిశారనేది తెలియలేదు. వీరు మాట్లాడుకుంటుండగా వీడియోలో రికార్డు చేస్తుండటాన్ని బట్టి.. ఏదో ఇంటర్వ్యూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ కలిసి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారోనని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ కలిసిన ఫొటోలను షేర్ చేస్తూ.. మురిసిపోతున్నారు. "ఒకే ఫ్రేమ్‌లో రెండు 'గోట్'లు", "మిస్ యూ లెజెండ్స్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. "మీ ఇద్దరూ కలిసి బ్యాటింగ్ చేయాడన్ని నిషేధించాలి" అంటూ ఈ జోడీ ఎంత విధ్వంసరమో గుర్తుచేసేలా మరికొందరు పరోక్షంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.