Aaron Finch US Masters 2023 : ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తుఫాను బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరొందిన ఫించ్ తన ఆట తీరుతో ప్రత్యర్థులను హడలెత్తించేవాడు. అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా తను ఏ మాత్రం మారలేదని మరోసారి రుజువు చేశాడు. తాజాగా జరిగిన యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో తన సత్తా చాటి అందరి చేత ఔరా అనిపించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కాలిఫోర్నియా నైట్స్ తరఫున ఆడిన ఫించ్.. తన ప్రత్యర్థి న్యూజెర్సీ ట్రిటాన్స్‌పై ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదాడు.
హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఫించ్ జట్టు ఆడిన 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అయితే ఇందులో 31 బంతులు ఎదుర్కొన ఫించ్ మూడు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 75 పరుగులు చేశాడు. అలా టోర్నీలో రెండో అత్యుత్తమ స్కోరును నమోదు చేసి రికార్డుకెక్కాడు.
California Knights Vs New Jersey : కాలిఫోర్నియా ఆడిన తొమ్మిదో ఓవర్లో ఫించ్ చెలరేగిపోయాడు. క్రిస్ బార్న్‌వెల్ బౌలింగ్‌లో ఆడిన తొలి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదిన ఫించ్.. నాలుగో సిక్స్‌తో జట్టు స్కోరును 100 వరకు తీసుకెళ్లాడు. ఇక క్రిస్ ఆరో బంతిని వైడ్ గా విసరగా... మళ్లీ ఫించ్‌కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే అవకాశం వచ్చింది. అయితే, క్రిస్ చివరి బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల విసిరాడు. దీంతో ఫించ్ మిస్ అయ్యాడు. అయినప్పటికీ ఈ ఇన్నింగ్స్ జట్టుకు బలమైన స్కోరు అందించాడు.