ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ సమయంలోనే అక్కడ నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్'(The Hundred league) క్రికెట్ లీగ్ కోసం పలువురు ఆటగాళ్లను వదిలేయడంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఈ విషయంపై క్రికెట్ విమర్శకులు నోరు మెదపడంలేదని ధ్వజమెత్తాడు. అదే పని భారత్ చేసి ఉంటే ఈపాటికి ప్రపంచంలోని విమర్శకులంతా వేలెత్తి చూపేవాళ్లని పేర్కొన్నాడు.
అసలేం జరిగిందంటే..!
ప్రస్తుతం టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఇదే సమయంలో 'ది హండ్రెడ్' క్రికెట్ లీగ్ కూడా కీలక దశకు చేరుకుంది. అయితే, ఆ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్, సదరన్ బ్రేవ్ జట్లకు మోయిన్ అలీ, క్రేజ్ ఓవర్టన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక భారత్‌తో మూడో టెస్టుకు ముందు వారం రోజుల విరామం దొరకడం వల్ల ఇంగ్లాండ్ జట్టు యాజమాన్యం వారిద్దరికీ ఆ లీగ్‌లో పాల్గొనడానికి అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలోనే చోప్రా స్పందిస్తూ.. ఇంగ్లాండ్ చేసిన పనే బీసీసీఐ, టీమ్‌ఇండియా చేసి ఉంటే ఈపాటికి విమర్శకులంతా ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారని అన్నాడు. "టెస్టు సిరీస్ మధ్యలో బీసీసీఐ కూడా ఇలాగే ఐపీఎల్ కీలక దశను ఖరారు చేసి ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఈపాటికి ప్రపంచం మొత్తం భారత క్రికెట్‌ను విమర్శిస్తూ ఉండేది. డబ్బు కోసం ఏదైనా చేస్తుందని అనేవాళ్లు" అంటూ ఆకాశ్ వరుస ట్వీట్లు చేశాడు.