తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు.. వన్డేల్లో ఇది ఎన్నోసారి? - eng vs ned odi 2022

నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో విజృంభించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏకంగా 498 పరుగులతో వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేశారు. సాల్ట్, మలన్, బట్లర్.. ముగ్గురూ​ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వన్డేల్లో ఇలాంటి అరుదైన సంఘటన గతంలోనూ రెండుసార్లు జరిగింది. అది ఎప్పుడంటే..

3 centuries in one odi innings
eng vs ned odi 2022

By

Published : Jun 18, 2022, 5:50 PM IST

వన్డేల్లో ఒక ఆటగాడు, ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం సాధారణ విషయమే. కానీ, ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ శతకాలు బాదడం చాలా అరుదైన విషయం. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఫిల్‌ సాల్ట్‌, డేవిడ్‌ మలన్‌తో పాటు జోస్‌ బట్లర్‌ ఈ ఘనత సాధించి ఆ అరుదైన జాబితాలో చేరారు. అంతకుముందు కేవలం దక్షిణాఫ్రికా ఆటగాళ్లకే రెండుసార్లు సొంతమైన ఈ అరుదైన ఘనత ఇప్పుడు ఇంగ్లాండ్‌ చెంత కూడా చేరింది.

డివిలియర్స్‌ ఉతికారేసిన వేళ..:ఒక వన్డే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ శతకాలు చేయడం 2015లో తొలిసారి జరిగింది. జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తొలుత ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (153 నాటౌట్‌; 142 బంతుల్లో 14x4), రిలీ రొస్సో (128; 115 బంతుల్లో 11x4, 2x6) శతకాలతో అదరగొట్టగా.. తొలి వికెట్‌కు 247 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు.

ఆమ్లా-ఏబీ డివిలియర్స్​

ఈ క్రమంలోనే రిలే ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్ మరింత రెచ్చిపోయాడు. విండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విధ్వంసం సృష్టించాడు. కేవలం 31 బంతుల్లోనే శతకం సాధించాడు. చివరికి డివిలియర్స్‌ (149; 44 బంతుల్లో 9x4, 16x6) భారీ స్కోర్‌ సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లకు 439/2తో భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో విండీస్‌ 291/7 స్కోర్‌కే పరిమితమైంది. డ్వేన్‌ స్మిత్‌ (64) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఫాఫ్ డుప్లెసిస్

అదే ఏడాది భారత్‌పై..:ఇక రెండోసారి ముగ్గురు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఒకే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు సాధించింది కూడా 2015లోనే. ఆ ఏడాది అక్టోబర్‌లో వాంఖడే వేదికగా టీమ్‌ఇండియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌ మరోసారి రెచ్చిపోయారు. ఓపెనర్‌ క్వింటన్ డికాక్ (109; 87 బంతుల్లో 17x4, 1x6), ఫాఫ్ డుప్లెసిస్ (133 రిటైర్డ్‌ హర్ట్‌; 115 బంతుల్లో 9x4, 6x6) శతకాలు సాధించగా కెప్టెన్‌ఏబీ డివిలియర్స్ (119; 61 బంతుల్లో 3x4, 11x6) మరో మేటి ఇన్నింగ్స్‌ ఆడాడు.

క్వింటన్ డికాక్

దీంతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 438/4 భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన భారత్ 224 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానె (87), శిఖర్‌ ధావన్‌ (60) మాత్రమే అర్ధశతకాలు సాధించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు.

డివిలియర్స్​

ఇంగ్లాండ్‌ తొలిసారి..:తాజాగా ఇంగ్లాండ్‌ జట్టులోనూ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ ఒకే ఇన్నింగ్స్‌లో శతకాలు సాధించి ఆ అరుదైన రికార్డులో భాగమయ్యారు. ఆమ్‌స్టల్‌వీన్‌ వేదికగా శుక్రవారం పసికూన నెదర్లాండ్స్‌ జట్టుతో తలపడిన వేళ ఈ ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ దంచికొట్టారు. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్ (122; 93 బంతుల్లో 14x4, 3x6), డేవిడ్ మలన్ (125; 109 బంతుల్లో 9x4, 3x6)తొలుత శతకాలతో అదరగొట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 222 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే సాల్ట్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ (162 నాటౌట్‌; 70 బంతుల్లో 7x4, 14x6) ఎడాపెడా బౌండరీల వర్షం కురపించాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు. దీంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 498/4 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 49.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (72) పరుగులతో రాణించాడు.

బట్లర్

ఇదీ చూడండి:ఫాస్టెస్ట్​ 150 స్కోరు.. బట్లర్​ జస్ట్​ మిస్​.. టాప్​-5లో ఎవరెవరు?

ABOUT THE AUTHOR

...view details