భారత్- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ లార్డ్స్‌లో గురువారం(ఆగస్టు 12) నుంచి జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు టెస్టు ప్రారంభం కానుంది.
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో వరుణుడి కారణంగా విజయానికి దూరమైన టీమ్ ఇండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భావిస్తోంది. తొలి టెస్టులో విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానె, నయావాల్ ఛెతేశ్వర్ పుజారా గాడిలో పడాలని.. జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. తొలి టెస్టులో ఈ ముగ్గురూ కలిసి చేసింది 9 పరుగులే. అందులో కోహ్లీ డకౌట్ కావడం గమనార్హం.
మయాంక్ వస్తాడా?
గాయంతో తొలిటెస్టుకు దూరమైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నెట్స్‌లో సాధన చేస్తుండటం టీమ్ఇండియాకు సానుకూలాంశం. అయితే.. రాహుల్ తొలి టెస్టులో రాణించిన నేపథ్యంలో మయాంక్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది.
పేసర్ శార్దూల్ ఠాకుర్‌కు ప్రాక్టీస్ సమయంలో పిక్క కండరాలు పట్టేయడం వల్ల.. అతడి స్థానంలో అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్‌లలో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
బౌలింగ్ ఓకే.. మరి బ్యాటింగ్..
తొలి టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ రాణించగా.. రోహిత్ ఫర్వాలేదనిపించాడు. అయితే పుజారా, కోహ్లీ, రహానె వైఫల్యంతో భారత ఇన్నింగ్స్ ఇబ్బందుల్లో పడగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు తోడు ఆఖర్లో బుమ్రా మెరుపులు మెరిపించడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో.. గతకొంతకాలంగా పరుగుల వేటలో విఫలమవుతున్న కోహ్లీ, పుజారా, రహానె లార్డ్స్ టెస్టులోనైనా.. ఆశించిన స్థాయిలో ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
గాయంతో శార్దూల్ ఠాకుర్ ఆడలేని పరిస్థితుల్లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను తీసుకుంటారా లేదా మరో స్పిన్నర్ అశ్విన్‌తో వెళ్తారా అనే విషయం.. ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్‌లో నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్ కూర్పుతో ఆడతామని కోహ్లీ ఇంతకు ముందే ప్రకటించిన నేపథ్యంలో అశ్విన్‌కు చోటు దక్కడం కష్టమేనని అనిపిస్తోంది. అయితే ఇషాంత్, ఉమేష్ యాదవ్‌లతో పోలిస్తే అశ్విన్‌కు బ్యాటింగ్ సామర్థ్యం కలిసివచ్చే అవకాశముంది.