2028 Los Angeles Olympics Cricket : నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్. ఈ మెగా టోర్నీ అంటే అభిమానుల్లో భారీ అంచనాలు, ఆసక్తి ఉంటాయి. ముఖ్యంగా భారత అథ్లెట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ బరిలో దిగుతుంటే.. ఫ్యాన్స్ కళ్లన్నీ వారిపైనే ఉంటాయి. అలాంటి ఈ క్రీడల్లో మళ్లీ క్రికెట్ చేర్చబోతున్నట్లు రెండు మూడు రోజుల కిందట అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ముంబయిలో జరిగిన తాజా సమావేశంలో క్రికెట్ చేర్చే విషయమై ఓటింగ్ నిర్వహించగా.. కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. క్రికెట్ సహా 5 కొత్త క్రీడలకు చోటు కల్పించినట్లు పేర్కొంది. క్రికెట్ (టీ20)తో పాటు బేస్‌బాల్- సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లక్రాస్ (సిక్సస్), స్క్వాష్‌లకు కూడా ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించినట్లు చెప్పింది. ఈ విషయాన్ని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ అనౌన్స్ చేశారు. దీంతో 2028 లాస్‌ఏంజిలెస్ ఒలింపిక్స్‌లో(2028 Los Angeles Olympics) టీ20 టోర్నీ నిర్వహించనున్నారు.