2024 IPL Dhoni: టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఐపీఎల్-2024 జరగనుంది. 17వ సీజన్ ఐపీఎల్ ఎన్నో విశేషాలకు వేదిక కానుంది. మాజీ కెప్టెన్ ధోనీ ఈ సీజన్లోనే తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలకనున్నాడనే ప్రచారంతో పాటు స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బరిలో దిగనున్నాడు. అలా రానున్న ఐపీఎల్లో అందర్నీ ఆకట్టుకునే అంశాలేంటో చూద్దాం.
ధోనీకి ఇదే చివరిది?ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి 2024 చివరి లీగ్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. 43 ఏళ్ల ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ టోర్నీల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో గత సీజన్లోనే రిటైర్మెంట్ తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ, ఈ సీజన్లోనూ ఆడతానని ప్రకటించడం వల్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మరి ఈ ఏడాది ఐపీఎల్ పూర్తయ్యాక ధోనీ డొమెస్టిక్ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెబుతాడా? లేదా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
రిషబ్ పంత్ రీ ఎంట్రీ:దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022లో రోడ్డు ప్రమాదం గాయపడ్డ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. యాక్సిడెంట్ కారణంగా రిషబ్ పంత్ గతేడాది ఐపీఎల్ ఆడలేదు. పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధిస్తే 17వ సీజన్లో పంత్‌ను మళ్లీ గ్రౌండ్లో చూడవచ్చు. 2016 ఐపీఎల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి పంత్ దిల్లీ క్యాపిటల్స్ జట్టుతోనే ఉన్నాడు. ఐపీఎల్లో 98 మ్యాచ్‌లు ఆడిన పంత్ 2838 పరుగులు చేశాడు. అయితే పంత్ గైర్హాజరీలో దిల్లీ 2023లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మరి పంత్ రీ ఎంట్రీతో ఈసారి దిల్లీ ఏమేరకు రాణిస్తుందో చూడాలి.
ముంబయి ఇండియన్స్ కొత్త శకం:రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను నుంచి తప్పించి ముంబయి ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యకు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో ముంబయి ఒక్కసారిగా ఇంటర్నెట్లో హాట్టాపిగ్గా మారింది. అయితే ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను తప్పించడం అతడి ఫ్యాన్స్‌కు నచ్చలేదు. మరి రోహిత్ వారసత్వాన్ని హార్దిక్ ఎంతవరకు కొనసాగిస్తాడు? ముంబయిని ఎంత సమర్థంగా నడుపుతాడనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ముంబయి మేనేజ్మెంట్ మాత్రం హార్దిక్‌పై బాగానే ఆశలు పెట్టుకుంది.