2024 IPL Auction :కొత్తగా ముంబయి ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్య స్థానాన్ని గుజరాత్ ఏ ఆటగాడితో భర్తీ చేస్తుంది? శార్దూల్ ఠాకూర్‌ను ఏ టీమ్ దక్కించుకుంటుంది? హర్షల్ పటేల్‌కు ఎంత ధరకు కొనుగోలు చేస్తారు? మనీశ్ ఏ టీమ్‌లో చేరతాడు? ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, స్టార్క్, రచిన్ రవీంద్ర వంటి విదేశీ ప్లేయర్లలో జాక్‌పాట్ ఎవరికి తగులుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ నేడు (మంగళవారం) జరగనున్న మినీ వేలంలో సమాధానాలు దొరకనున్నాయి. మరి ఈ వేలంలో రూ.కోట్లు కొల్లగొట్టేదెవరోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2024 ఐపీఎల్ కోసం దుబాయ్ వేదికగా నేడు (మంగళవారం) జరగనుంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అందుబాటులో ఉన్నారు. వారిలో 214 మంది భారత క్రికెటర్లు కాగా, 119 మంది ఫారిన్ ప్లేయర్లు. ఇక ప్రస్తుతం 77 స్లాట్లు ఖాళీగా ఉండగా, అందులో 30 ఫారిన్ ప్లేయర్ల కోటా.
ఈ వేలంలో అత్యధిక ధర ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఆస్ట్రేలియా స్టార్ పేస్‌గన్ మిచెల్ స్టార్క్ (బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు) దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వేలంలోకి వచ్చాడు. ఈ పేసర్ కోసం పలు ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీఉండే ఛాన్స్ ఉంది. అతడి తర్వాత న్యూజిలాండ్ యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్రపైనే అందరి కళ్లున్నాయి. రీసెంట్గా ముగిసిన వరల్డ్‌కప్‌లో అతడి ప్రదర్శనే ఇందుకు కారణం. రచిన్ (బేస్ ప్రైజ్ రూ. 50 లక్షలు) ఈ వేలంలో భారీ ధర దక్కింకోవడం ఖాయం!