2024 Cricket Tournament Schedule :కొత్త సంవత్సరం వచ్చేసింది. ఏడాది పాటు జరిగే మ్యాచ్లు, టోర్నీలు, టూర్లపై ముందస్తుగానే షెడ్యూల్ ఖరారైంది. గతేడాది వన్డే క్రికెట్ ప్రపంచ కప్ జరగ్గా, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇక ఐపీఎల్ 17వ సీజన్ ఎలాగూ వేసవిలో మస్తు మజాను అందించనుంది. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, యాషెస్ సిరీస్, భారత్‌లో పర్యటించనున్న విదేశీ జట్లతో ఏడాదంతా క్రికెట్ పండగే. దాదాపు ఏడాదిలో అన్ని నెలలు కవర్ అయ్యేలా షెడ్యూల్ ఖరారు చేశాయి ఆయా క్రికెట్ బోర్డులు.
భారత్ పర్యటనకు వస్తున్న ఇంగ్లాండ్
ఈ నెల 25 నుంచి రెండు నెలల పాటు మన దేశంలో పర్యటించనుంది ఇంగ్లాండ్. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ నెల 25 నుంచి మార్చి 11 వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందుకోసం హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్ కోట్, రాంచీ, ధర్మాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ కప్ పరాభావం తర్వాత తొలిసారిగా భారత్ వస్తోంది ఇంగ్లాండ్ జట్టు. టెస్టుల్లో ఇరు జట్ల మధ్య ఆసక్తికరమైన పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. రెండు జట్లు టాప్ ఆర్డర్ బలంగా ఉండటం, ఐదు రోజుల పాటు జరిగే సుదీర్ఘ మ్యాచ్లు వీక్షించే చాన్స్ మన తెలుగు ప్రేక్షకులకు లభించడం లక్కీఅనే చెప్పాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024
మార్చిలో ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ముగియగానే క్రికెట్ ప్రేమికులను అమితంగా ఆకర్షించే పొట్టి క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ తేదీలను ఇంకా ప్రకటించకపోయినా ఏటా జరిగే ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే ఈసారి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో దాదాపు 10 జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు 16 సీజన్లు దిగ్విజయంగా ముగియగా, ఈ ఏడాది 17వ సీజన్ టోర్నీ జరగనుంది. ఇందుకోసం దేశ, విదేశీ క్రీడాకారుల వేలం ఇప్పటికే పూర్తయింది. ఇక ఈ మెగా టోర్నీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)
ఐపీఎల్ మాదిరిగానే మహిళ క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. ఈ టోర్నీ రెండో సీజన్‌కు ఈ ఏడాది ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే మన మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ టోర్నీల్లో రాణిస్తుండటంతో ఈ లీగ్ చూసేందుకు అభిమానులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ టోర్నీలో ఐదు జట్లు తలపడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ టీమ్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తలపడుతున్నాయి. ఈ టోర్నీ తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.