2023 World Cup Semis Scenario :2023 వరల్డ్‌కప్‌లో డూ ఆర్ డై మ్యాచ్‌లో శ్రీలంకపై.. న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఫలితంగా సెమీస్‌కు కివీస్ మరింత దగ్గరైంది. టోర్నీలో ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్ చేరుకున్నాయి. మరో బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే ప్రస్తుత టోర్నీలో మ్యాచ్‌లన్నీ ఆడేసిన కివీస్.. 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. దీంతో పట్టికలో న్యూజిలాండ్ 4వ స్థానంలో కొనసాగుతోంది. కానీ, కివీస్ సెమీస్ బెర్త్ ఖరారు కావలంటే పాక్, అఫ్గాన్ జట్ల ఆఖరి మ్యాచ్ ఫలితాలు తేలాల్సిందే.
2023 World Cup Pakistan Semis Chances : ప్రస్తుతం పాక్ (0.036), అఫ్గాన్ (-0.338) నెట్ రన్‌రేట్‌తో పట్టికలో వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో కివీస్ (0.922)తో ఉంది. ఒకవేళ పాకిస్థాన్ లేదా అఫ్గాన్ సెమీస్ చేరాలంటే తమ ఆఖరి మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. పాక్ తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో పాక్.. మొదట బ్యాటింగ్ చేస్తే 287 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో నెగ్గాలి. అంటే పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 400 స్కోరు సాధించి ఇంగ్లాండ్‌ను 112 లోపు కట్టడి చేస్తే న్యూజిలాండ్ రన్‌రేట్‌ని అధిగమిస్తుంది. ఒకవేళ ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్‌కు దిగితే.. ఆ జట్టుని 150 పరుగుల లోపు కట్టడి చేసి ఆ లక్ష్యాన్ని 3.4 ఓవర్లలో ఛేదించాలి.
2023 World Cup Afghanistan Semis Chances : మరోవైపు పసికూన అఫ్గాన్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చి ఇక్కడిదాకా వచ్చింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ను చేజేతులా వదులుకుంది అఫ్గాన్. ఒకవేళ ఆ మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిచి ఉంటే.. తమ చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. డైరెక్ట్ సెమీస్‌కు అర్హత సాధించేది. కానీ, ఆ మ్యాచ్‌లో ఓటమి కారణంగా.. అఫ్గాన్ సెమీస్ అవకాశాలు దాదాపు ఆవిరయ్యాయి. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో కనీసం 438 పరుగుల తేడాతో విజయం సాధిస్తేనే.. అఫ్గానిస్థాన్‌కు సెమీస్ ద్వారాలు తెరుచుకుంటాయి.