2023 Rohit Virat Records :2023 ఏడాదిలో టీమ్ఇండియాకు అనేక అంశాలు కలిసొచ్చాయి. మూడు ఫార్మాట్లలో కలిపి ఎన్నో మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా నెగ్గింది. కానీ, రెండు మ్యాచ్‌ల ఫలితాలు మొత్తం పరిస్థితులను మార్చేశాయి. అందులో ఒకటి జూన్‌లో జరిగిన డబ్ల్యూటీసీ (WTC 2023) ఫైనల్ కాగా, రెండోది 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్. ఈ ఫలితాలు యావత్ టీమ్ఇండియా ఫ్యాన్స్‌ను కలచివేశాయి. అయితే ఈ రెండింట్లో మినహా, టీమ్ఇండియా అద్భుత విజయాలు సాధించడంలో కీ రోల్ ప్లే చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వీరిద్దరూ ఈ ఏడాదిలో సాధించిన కొన్ని ఘనతలేంటో తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ
- 2023 వరల్డ్‌కప్‌లో విరాట్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతడు ఈ మెగాటోర్నీలో 11 మ్యాచ్‌ల్లో 765 పరుగులు చేశాడు. దీంతో ఓ వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక పరుగులు బాదిన జాబితాలో, సచిన్ తెందూల్కర్ (674 పరుగులు) రికార్డు బ్రేక్ చేసి టాప్‌లో నిలిచాడు విరాట్.
- ఇక ఇదే టోర్నీలో విరాట్ 3 సెంచరీలు బాదాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక సెంచరీలు (50) నమోదు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇదివరకు సచిన్ (49) పేరిట ఉండేది. కాగా, విరాట్ అంతటి ఘనమైన రికార్డును బద్దలుకొట్టాడు.
- మరోవైపు ఇదే ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో విరాట్, వన్డేల్లో 13 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. దీంతో ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా (13848) విరాట్ కొనసాగుతున్నాడు. అతడి కంటే ముందు సచిన్, సంగక్కర ఉన్నారు. అయితే 13 వేల పరుగుల మార్క్ అందుకునేందుకు సచిన్ 321 ఇన్నింగ్స్ తీసుకోగా, విరాట్ 267 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు.
- ఇక ఆ ఏడాది ఐపీఎల్‌ల్లోనూ విరాట్ అదరగొట్టాడు. 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో 639 పరుగులు చేశాడు. అందులో రెండుసార్లు 100 మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ (7236) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అటు సెంచరీల పరంగానూ విరాట్‌దే టాప్ ప్లేస్. విరాట్ టోర్నీలో ఇప్పటివరకు 7 శతకాలు నమోదు చేశాడు.
రోహిత్ శర్మ
- ఈ ఏడాది రోహిత్ గురించి చెప్పుకోవాలంటే వరల్డ్‌కప్ ప్రదర్శనే. అతడు ఈ మెగాటోర్నీలో అదరహో అనిపించాడు. ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ 100+ స్టైక్ రేట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడాడు. ఈ క్రమంలో అతడు 11 ఇన్నింగ్స్‌ల్లో 597 పరుగుల సాధించి, లీగ్‌లో రెండో టాపర్‌గా నిలిచాడు. ఇందులో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- ఇక మెగాటోర్నీ సింగిల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా, టోర్నీ హిస్టరీలో అత్యధిక సిక్స్‌లు (58) బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు హిట్‌మ్యాన్. అలాగే వరుసగా రెండు ఎడిషన్ల్లో 500+ పరుగులు నమోదు చేసిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు.
- ఈ ఏడాది రోహిత్ వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ వన్డేల్లో 254 ఇన్నింగ్స్‌ల్లో 10709 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నాయి. ఇక 2023లో వన్డేల్లో రోహిత్ 60 సిక్స్‌లు బాదాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో ఇన్ని సిక్స్‌లు బాదిన బ్యాటర్ రోహితే.
- ఈ క్యాలెండర్ ఇయర్లో రోహిత్ వన్డేల్లో 27 మ్యాచ్‌ల్లో 1255 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కంటే ముందు శుభ్‌మన్ గిల్ (1584), విరాట్ (1377) ఇద్దరే ఉన్నారు. ఇక 2023లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ -3 బ్యాటర్లు టీమ్ఇండియా ప్లేయర్లే. అటు ఐపీఎల్‌లోనూ రోహిత్ 332 పరుగులతో రాణించాడు.