IPL mega auction: ఐపీఎల్ 14వ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈసారి మరో రెండు కొత్త టీమ్‌లో వచ్చి చేరడం వల్ల మరింత మజా అందించేందుకు సిద్ధమయ్యారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన మెగా వేలం వచ్చే నెలలో జరగనుంది. ఇప్పటికే ఈ లీగ్ కోసం 1214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 318 మంది విదేశీ క్రికెటర్లు వేలానికి రెడీ అని ప్రకటించారు. విండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు.
ఈ వేలంలో మొత్తం క్యాప్డ్ భారత ఆటగాళ్లు (61 మంది), క్యాప్డ్ ఇంటర్నేషనల్ (209 మంది), అసోసియేట్ (41 మంది), ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్న అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు (143 మంది), గత సీజన్లలో పాల్గొన్న అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు (6 మంది), అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు (692 మంది), అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు (62) మంది తమ పేర్లను మెగావేలం కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
"ప్రతి జట్టులోనూ 25 మంది ఆటగాళ్లను తీసుకునే వీలుంది. మొత్తం 217 ఆటగాళ్లను వేలం ద్వారా తీసుకునే అవకాశం ఉంది. ఇందులో 70 మంది విదేశీ క్రికెటర్లు ఉండవచ్చు" అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలియజేసింది.