IND vs WI 2022: మిడిలార్డర్ వైఫల్యంతో దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్.. జట్టు కూర్పును నిర్మించుకోవడమే లక్ష్యంగా వెస్డిండీస్‌తో పోరుకు సిద్ధమైంది. మళ్లీ జట్టును విజయాలబాట పట్టించాలని రోహిత్-ద్రవిడ్ ద్వయం భావిస్తోంది. విండీస్‌తో తొలి వన్డే ద్వారా ప్రపంచ క్రికెట్లో 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా టీమ్ఇండియా.. చరిత్ర సృష్టించనుంది. 1974లో తొలి వన్డే ఆడిన భారత్.. 47 ఏళ్ల తర్వాత ఇప్పుడు 1000వ వన్డే ఆడనుంది.
ఈ క్రమంలోనే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ నాటికి జట్టు కూర్పును సెట్ చేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో బయటపడ్డ లోపాలను ఈ సిరీస్ ద్వారా సరి చేయాలని రోహిత్-ద్రవిడ్ భావిస్తున్నారు. రోహిత్ కెప్టెన్‌గా తిరిగి జట్టులో చేరడం జట్టుకు కలిసి రానుంది.
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్‌లు కరోనా బారిన పడటం వల్ల ఇషాన్ కిషన్ రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్‌లో తన మునుపటి ఫామ్ అందుకోవాలని జట్టు కోరుకుంటోంది. కరోనాతో శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు దూరం కాగా మిడిల్ ఆర్డర్‌లో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారు అనేది తేలాల్సి ఉంది.