భారతదేశంలో క్రికెట్‌కు ఎనలేని ఆదరణ ఉంది. కోట్ల మంది ప్రేమించే ఈ క్రీడలో అరంగేట్రం చేయాలని ఎంతోమంది యువత కలలు కంటారు. అయితే క్రికెట్లో రాణించాలంటే కృషి, పట్టుదలతో పాటు భారత్‌కు ఆడాలంటే కొంత అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే ఇతర దేశాలతో పోలిస్తే క్రికెట్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమనేది చాలా గొప్ప. ఆ లక్ష్యంతో ఎంతోమంది క్రికెటర్లు భారత జట్టులో ఓ వెలుగు వెలుగగా.. మరికొంత మంది పరిమిత మ్యాచ్‌లు ఆడి సరిపెట్టుకున్నారు. అయితే భారత జట్టు తరఫున కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌తోనే కనిపించకుండా పోయినా క్రీడాకారులూ ఉన్నారు. అలా ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన క్రికెటర్లు ఎవరో ఈ సందర్భంగా తెలుసుకుందాం.
1) ఫైజ్ ఫజల్
విదర్భ ఫస్ట్‌క్లాస్ జట్టుకు చెందిన ఫైజ్ ఫజల్.. 2016లో హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 30 ఏళ్ల వయసులో టీమ్ఇండియాకు సెలెక్ట్ అయిన తొలి ఆటగాడు ఇతడే కావడం విశేషం. అదే అతడికి చివరి మ్యాచ్ కూడా. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 2003లో అరంగేట్రం చేసి.. 125 మ్యాచ్‌లలో 8,404 పరుగులు నమోదు చేశాడు. అత్యధికంగా 127 పరుగులు నమోదు చేశాడు.
2) విజయ్ రాజేందర్‌నాథ్
పంజాబ్‌లోని అమృతసర్‌కు చెందిన విజయ్ రాజేందర్‌నాథ్.. 1952-53లో టీమ్ఇండియా తరఫున వికెట్ కీపర్‌గా అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో సెలెక్టర్లు అవకాశం ఇచ్చిన నలుగురు వికెట్ కీపర్లలో ఈయన ఒక్కడు. ముంబయి వేదికగా జరిగిన మూడో టెస్టులో నాలుగు స్టంపౌట్లు చేశాడు.. కానీ బ్యాటింగ్ చేసేందుకు అవకాశం రాలేదు. ఆ తర్వాత టీమ్ఇండియాలో అతడు కనిపించలేదు. వికెట్ కీపర్‌గా విజయ్ కెరీర్లో ఒక్క క్యాచ్ కూడా లేదు.
విజయ్ రాజేందర్‌నాథ్.. రంజీల్లో బిహార్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వికెట్ కీపర్‌గా తన కెరీర్లో 844 రన్స్, 34 క్యాచ్‌లు, 23 స్టంపింగ్స్ సాధించాడు.
3) ఇక్బాల్ సిద్ధిఖీ
2001లో మొహలీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో టీమ్ఇండియా తరఫున ఇక్బాల్ సిద్ధిఖీ అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేసి ఆల్‌రౌండర్‌గా పేరొందాడు. ఆ మ్యాచ్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆయన 24 పరుగులు సాధించడం సహా ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ తర్వాత అతడు టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించలేదు.
ఇక్బాల్ సిద్ధిఖీ.. 1993-94లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో మొత్తంగా 90 మ్యాచ్‌లు ఆడి 315 వికెట్లు పడగొట్టాడు.
4) మయాంక్ మార్కండే
2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మయాంక్ మార్కండే కూడా టీమ్ఇండియా తరఫున ఒకే మ్యాచ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో 31 పరుగులు నమోదు చేసి.. ఒక్క వికెట్ కూడా సాధించలేదు.
అంతకుముందు ఐపీఎల్-2018లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్.. 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. 2018-19 సీజన్లలో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మయాంక్.. 29 వికెట్లు సాధించాడు.
5) కెనియా జయంతిలాల్
1971లో వెస్టిండీస్‌తో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో సునీల్ గావస్కర్.. 774 పరుగులు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లోని తొలి టెస్టుకు గావాస్కర్‌కు గాయం కారణంగా విశ్రాంతి లభించడం వల్ల ఆ స్థానంలో రిజర్వ్ బ్యాట్స్‌మన్ కెనియా జయంతిలాల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 రన్స్ నమోదు చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశం భారత్‌కు రాలేదు. దీంతో జయంతిలాల్.. భారత్ తరఫున ఏకైక మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు.
కెనియా జయంతిలాల్.. హైదరాబాద్‌కు చెందిన రంజీ జట్టుకు 91 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి.. 4,687 పరుగులు నమోదు చేశాడు.