విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారిని 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఇటీవలె ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనపై షట్లర్ పారుపల్లి కశ్యప్ స్పందించాడు. రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంటే పలు టోర్నీల షెడ్యూళ్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదే జరిగితే ప్లేయర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించటం కష్టమవుతుందని వెల్లడించాడు.
"మమ్మల్ని రెండు వారాలు నిర్బంధిస్తారో లేదో తెలియదు. కానీ, ఇలా చేయటం వల్ల ఒలింపిక్స్ అర్హత పోటీలకు ఏర్పాటు చేసుకున్న మా షెడ్యూల్ తారుమారు అవుతుంది. కొంతమంది భారత షట్లర్లు ఇప్పటికే ఒలింపిక్స్ అర్హతకు దగ్గర్లో ఉన్నారు. తాజా నిర్ణయం వల్ల కీలక టోర్నీలకు హాజరవడానికి ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నిర్బంధం వల్ల స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్‌లో పాల్గొనటం కష్టమవుతుంది."
- పారుపల్లి కశ్యప్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు