థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-500 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ పురుషుల ద్వయం సాత్విక్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జకార్తా వేదికగా జరిగిన సెమీఫైనల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ జోడీ షిన్ బెక్-కో సంగ్(దక్షిణ కొరియా)పై గెలుపొందారు. ఫలితంగా ఈ మెగా టోర్నీలో తొలిసారి టైటిల్ వేటలో నిలిచారు.
మెన్స్ డబుల్స్ 16వ ర్యాంక్‌లో ఉన్న భారత జోడీ.. 22-20, 22-24, 21-9 తేడాతో 19వ ర్యాంక్ ద్వయం షిన్ బెక్ - కో సంగ్‌పై గెలిచారు.
మళ్లీ ఫామ్‌లోకి..
తొలి రెండు సెట్లు హోరాహోరీగా జరిగాయి. మొదటి సెట్లో గెలిచిన భారత యువ ఆటగాళ్లు... రెండో సెట్‌ను కొద్దిలో కోల్పోయారు. కచ్చితంగా గెలవాల్సిన మూడో సెట్లో తమదైన ప్రదర్శనతో అలవోకగా నెగ్గారు. గాయం కారణంగా దాదాపు 5 నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టిన సాత్విక్.. పవర్ఫుల్ స్మాష్‌లతో అదరగొట్టాడు. ఫలితంగా ఈ టోర్నీలో ఫైనల్ చేరి సంచలనం సృష్టించారీ షట్లర్లు.
చైనాతో పోరు..
సాత్విక్-చిరాగ్ జోడీ ఫైనల్లో ప్రపంచ నెంబర్-2.. లీ జున్ హు-లూ యు చెన్ (చైనా)తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది.
2018లో జరిగిన హైదరాబాద్ ఓపెన్ సూపర్ 100 టోర్నమెంట్ సహా అదే ఏడాది జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలోనూ వీరే విజేతలు. ఇండోనేసియా ఓపెన్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశారు.