తెలంగాణ

telangana

ETV Bharat / sports

సయ్యద్​ మోదీ బ్యాడ్మింటన్​: క్వార్టర్స్​లో శ్రీకాంత్​, సౌరభ్​ - భారత షట్లర్లు

సయ్యద్​ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్​ టోర్నీలో భారత్​కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రముఖ షట్లర్లు శ్రీకాంత్​, సౌరభ్​ వర్మ, మహిళా ప్లేయర్​ రీతుపర్ణ క్వార్టర్​ ఫైనల్లో అడుగుపెట్టారు. ప్రపంచ ఛాంపియన్​షిప్​ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయి ప్రణీత్​, హెచ్​.ఎస్​ ప్రణయ్​, పారుపల్లి కశ్యప్​ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Syed Modi International 2019: Kidambi Srikanth, Sourab varma enters into quarter finals
సయ్యద్​ మోదీ బ్యాడ్మింటన్​: క్వార్టర్స్​లో శ్రీకాంత్​, సౌరభ్​

By

Published : Nov 29, 2019, 10:45 AM IST

లఖ్‌నవూ వేదికగా జరుగుతున్న సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్‌, సౌరభ్‌వర్మ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ శ్రీకాంత్‌ 18-21, 22-20, 21-16తో పారుపల్లి కశ్యప్‌పై, సౌరభ్‌వర్మ 21-11, 21-18తో ఆలాప్‌ మిశ్రాపై విజయం సాధించారు.

సౌరభ్​ వర్మ శుక్రవారం(నవంబర్​ 29న) జరగనున్న మ్యాచ్​లో విటిడ్​ సర్న్​(థాయిలాండ్​)తో తలపడనున్నాడు. ఇది మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. శ్రీకాంత్​... వాన్​ హో(కొరియా)తో పోటీపడనున్నాడు. ఈ మ్యాచ్​ 5 గంటలకు జరగనుంది.

నలుగురు ఓటమి...

నాలుగో సీడ్‌ సాయిప్రణీత్‌... కున్లవుత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయాడు. వరుస సెట్లలో 11-21, 17-21తో పరాజయం చెందాడు. లక్ష్యసేన్‌ 14-21, 17-21 తేడాతో సాన్‌ వాన్‌ (కొరియా) చేతిలో ఖంగుతిన్నాడు.

లక్ష్యసేన్​, సాయి ప్రణీత్​

సిరిల్‌వర్మ 9-21, 22-24 తేడాతో వాంగ్‌ హి (కొరియా) చేతిలో, అజయ్‌ జయరాం 18-21, 21-14, 28-30 తేడాతో జున్‌ పెంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్​లోనే ఇంటిముఖం పట్టారు.

మహిళలు, మిక్స్​డ్​లో...

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో గెలిచి రితుపర్ణ దాస్‌ క్వార్టర్స్​ చేరుకుంది. వరుస సెట్లలో 16-21, 13-21 తేడాతో తన్వి లాడ్‌పై నెగ్గింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రణవ్‌ చోప్రా- సిక్కిరెడ్డి జోడీ 12-21, 21-18, 13-21 తేడాతో సీడెల్‌- లిండా (జర్మనీ) ద్వయం చేతిలో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప కోల్‌- లారెన్‌ (ఇంగ్లాండ్‌)తో జరిగిన మ్యాచ్​లో రిటైర్డ్‌ హర్ట్​గా వెనుదిరిగారు.

రితుపర్ణ దాస్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details