స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రిటైర్మెంట్ తీసుకుందా? సడన్‌గా ఆమె ట్విట్టర్ చూసిన వాళ్లకు ఈ సందేహం రాకమానదు. కానీ ఆ ట్వీట్ సారాంశం చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆటకు కొద్ది రోజులు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. కరోనా విషయంలో మరింత అప్రమత్తత అవసరమని పేర్కొంది. ప్రాణాంతక మహమ్మారి గురించి అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
రిటైర్మెంట్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన పీవీ సింధు - పీవీ సింధు రిటైర్మెంట్ వార్తలు
రిటైర్మెంట్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన పీవీ సింధు.. తన ట్వీట్‌తో అభిమానులకు మినీ హార్ట్ ఎటాక్ తెప్పించింది. కానీ దానితో పాటే ఓ వివరణ కూడా ఇచ్చింది. అయితే ఈమె తండ్రి రమణను 'ఈటీవీ భారత్' సంప్రదించగా, రిటైర్మెంట్ వార్తలు వదంతులేనని ట్వీట్ మొత్తం చదవాలని తెలిపారు.
"కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారింది. నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునేదాన్ని. చివరి వరకు పోరాడేదాన్ని. ఇంతకు ముందు చేశాను, ఇకపై కూడా చేయగలను. కానీ, కంటికి కనిపించని వైరస్‌ను ఎలా ఓడించగలను. నెలలు గడుస్తున్నాయి. బయటకు వెళ్లాలనుకునే ప్రతీసారి ఆలోచిస్తున్నాం. విశ్రాంతి లేని ఆటకు స్వప్తి పలకాలని నిర్ణయించుకున్నా.. నెగిటివిటీ, భయం, అనిశ్చితి నుంచి రిటైర్ అవ్వబోతున్నా.. ప్రతీరోజు సోషల్ మీడియాలో చదువుతున్న కథనాలు నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి. మనం మరింత సంసిద్ధంగా ఉండాలి. కలిసికట్టుగా వైరస్‌ను ఓడించాలి. ఇప్పుడు మనం వేసే అడుగు, తీసుకునే నిర్ణయం మన, మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారిని ఓడిపోనివ్వకుండా చూడాలి" -ట్విట్టర్లో సింధు
టోక్యో ఒలింపిక్స్ కోసం కఠోర శిక్షణ కొనసాగిస్తానని చెప్పిన సింధు.. వచ్చే ఏడాది జరిగే ఆసియా ఓపెన్‌తో, రెట్టించిన ఉత్సాహంతో తిరిగి మైదానంలోకి అడుగుపెడతానని చెప్పింది.