తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ బ్యాడ్మింటన్​లో 'సువర్ణ' సింధు - ఒకుహర

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో హ్యాట్రిక్‌ సార్లు ఫైనల్లో అడుగుపెట్టిన సింధు ఎట్టకేలకు పసిడి గెలిచింది. స్విట్జర్లాండ్​లోని బాసెల్​ వేదికగా ఒకుహరతో జరిగిన ఫైనల్లో... విజేతగా నిలిచి టైటిల్​ కైవసం చేసుకుంది. ఫలితంగా భారత బ్యాడ్మింటన్‌ స్వర్ణయుగంలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.

sindhu won the badminton final

By

Published : Aug 25, 2019, 6:32 PM IST

Updated : Sep 28, 2019, 5:51 AM IST

ప్రపంచ ఛాంపియన్​షిప్​ సెమీస్​లో విజయం సాధించిన అనంతరం మాట్లాడిన సింధు.. " ఫైనల్​ వరకు చేరినందుకు ఆనందంగా ఉన్నా సంతృప్తిగా లేను" అని ఉద్వేగంతో మాట్లాడింది. ఆ మాటల్ని నిజం చేస్తూ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణ పతకం సాధించింది.

ఒకుహుర(జపాన్​)తో ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో టైటిల్​ గెలిచి... తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకుంది సింధు. ఫైనల్​ మ్యాచ్​లో వరుసగా రెండు సెట్లలోనూ జపాన్​ ప్లేయర్​ను చిత్తుచేసి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జగజ్జేతగా నిలిచింది. గతంలో రెండు సార్లు చివరి మెట్టుపై తడబడిన సింధు.. ఈ సారి పసిడి సొంతం చేసుకుంది.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు... తొలి సెట్​ 21-7 తేడాతో గెలిచింది. రెండో సెట్​లోనూ అదే జోష్​ చూపించి 21-7తేడాతో విజయం సాధించింది. తెలుగమ్మాయి తిరుగులేని స్మాష్​లకు జపాన్​ క్రీడాకారిణి సమాధానం చెప్పలేకపోయింది.

అసాధారణ ప్రతిభ...

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు ప్రస్థానం అసాధారణం. ప్రకాశ్‌ పదుకొనే కాంస్యం నెగ్గాక మరో పతకం కోసం మూడు దశాబ్దాలు సాగిన నిరీక్షణకు 2013లో తెరదించుతూ కాంస్యం నెగ్గింది. అయితే తర్వాత ఇంకో మూడు పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇప్పటికే ఈ టోర్నీలో సింధు ప్రదర్శన అద్భుతంగా సాగినా... స్వర్ణం సాకారం కాలేదు. గతంలో జరిగిన రెండు ఫైనల్లోనూ గొప్పగా పోరాడి ఓడి రజతాలతో సరిపెట్టుకుంది.

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో సింధు ప్రస్థానం

ప్రతీకారం తీరింది..

జపాన్​ క్రీడాకారిణి ఒకుహరతో పోటీపడిన మ్యాచ్‌ల్లో 8-7తో సింధూదే పైచేయి. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తుదిపోరులో సింధు.. ఒకుహర చేతిలోనే ఓడింది. తొలిసారి ఆ ప్రతిష్ఠాత్మక టోర్నీ ఫైనల్‌ చేరి టైటిల్‌కు అత్యంత చేరువగా వెళ్లిన ఆమెకు నిరాశను మిగిల్చిందీ జపాన్‌ స్టార్‌. మళ్లీ రెండేళ్ల తర్వాత సింధును అడ్డుకోవడానికి సిద్ధమైంది. ఈసారి ఒకుహరను మట్టికరిపించి పసిడి కల నెరవేర్చుకుంది తెలుగమ్మాయి. 2017 పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.

Last Updated : Sep 28, 2019, 5:51 AM IST

ABOUT THE AUTHOR

...view details