జూన్ 23న ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రపంచ ఛాంపియన్, స్టార్ షట్లర్ పీవీ సింధు లైవ్ వర్కౌట్ కార్యక్రమంలో పాల్గొననుంది. ఆమెతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగిన మరో 21 మంది అథ్లెట్లు ఇందులో భాగం కానున్నారు. భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్.. ఈ ఈవెంట్లో కసరత్తులు చేయనుంది. వినేశ్ ఇప్పటికే 23 మంది ఒలింపియన్లతో కలిసి రికార్డు చేసిన ఓ వర్కౌట్ వీడియోలో పాల్గొంది.
ఈ లైవ్‌షోలో క్రీడాకారులు వారికి నచ్చిన వ్యాయామాలు చేయొచ్చు. వీటన్నింటిని ఒలింపిక్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం పీవీ సింధు, జూన్ 23న ఉదయం 11 గంటలకు లైవ్‌లో వర్కౌట్లు చేయనుంది. హైదరాబాద్‌లోని తన ఇంట్లో నుంచే ఈ వర్చువల్ కార్యక్రమానికి హాజరుకానుంది. ఆమె చేసే కసరత్తులను ఒలింపిక్స్ ఇన్‌స్టా ఖాతా లైవ్‌లో చూడొచ్చు.