తెలంగాణ

telangana

By

Published : Jul 23, 2019, 5:49 AM IST

ETV Bharat / sports

జపాన్ ఓపెన్​లో సింధు, సైనా రాణించేనా..?

టోక్యోలో నేటి నుంచి జరగనున్న జపాన్​ ఓపెన్​లో భారత షట్లర్లు తమ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. సైనా ఈ టోర్నీకి అందుబాటులోకి రానుంది. ఇండోనేసియా ఓపెన్​లో ఫైనల్​లో వెనుదిరిగిన సింధు ఈ టైటిల్​పై గురిపెట్టింది.

సింధు - సైనా

ఇండోనేసియా ఓపెన్​లో నిరాశపరిచిన పీవీ సింధు తదుపరి టోర్నీకి సిద్ధమవుతోంది. నేటి నుంచి ఆరంభం కాబోతున్న జపాన్ ఓపెన్​పై దృష్టి సారించింది. ఇండోనేసియా ఓపెన్​కు దూరంగా ఉన్న సైనా ఈ టోర్నీకి అందుబాటులోకి రానుంది.

సింధు టైటిల్ నెగ్గేనా..

ఈ సీజన్​లో ఒక్క టైటిల్​ కూడా గెలవని సింధు ఈ టోర్నీలో గెలిచి ట్రోఫీ ఆకలి తీర్చుకోవాలని చూస్తోంది. ఇండోనేసియా ఓపెన్​లో ఫైనల్​ చేరిన సింధు తప్పక గెలుస్తుందని అందరూ ఆశించారు. కానీ జపాన్​కు చెందిన యమగూచి.. సింధు టైటిల్​ ఆశలపై నీళ్లు చల్లింది. 15-21, 16-21 తేడాతో సింధును ఓడించింది.

నేడు ఆరంభంకానున్న ఈ టోర్నీలో తొలి రౌండ్​లో చైనాకు చెందిన హ్యా యూతో తలపడనుంది సింధు. ఈ ప్రారంభ అడ్డంకిని దాటితే రెండో రౌండ్​లో కిర్​స్టీ గిల్మౌర్(స్కాట్లాండ్) లేదా ఒహోరి(జపాన్​) ఇద్దరిలో ఒకరితో పోటీపడనుంది. ఇందులోనూ నెగ్గితే క్వార్టర్స్​లో యమగూచితో తలపడే అవకాశముంది. అందులో ఓడించి ఇండోనేసియా ఓపెన్​ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది సింధు.

సైనా ఎంటర్​ అవుతోంది..

ఫిట్​నెస్​ లేమితో ఇండోనేసియా ఓపెన్​కు దూరమైన సైనా నెహ్వాల్ జపాన్​ ఓపెన్​లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్​లో టైటిల్​ నెగ్గిన ఏకైక క్రీడాకారిణి సైనానే. గాయాలు వెంటాడుతున్నా.. ముఖ్యటోర్నీల్లో ఆకట్టుకుంటూనే ఉంది. జపాన్​లో సత్తాచాటాలని అనుకుంటోంది.
థాయ్​లాండ్ క్రీడాకారిణి బుస్నాన్​ను తొలి రౌండ్​లో ఎదుర్కొనుంది సైనా. వీరిద్దరు నాలుగు సార్లు ముఖాముఖి తలపడితే 3 సార్లు సైనానే గెలిచింది.

పురుషుల సింగిల్స్​లో శ్రీకాంత్ - ప్రణయ్

జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్​లో ఇద్దరూ భారతీయులే పోటీపడటం గమనార్హం. కిదాంబి శ్రీకాంత్.. ప్రణయ్​ను ఢీ కొట్టనున్నాడు. అంతర్జాతీయ వేదికపై వీరిద్దరూ 5 సార్లు ముఖాముఖి తలపడగా గత నాలుగు పర్యాయాలు ప్రణయే గెలిచాడు.

స్విస్​ ఓపెన్ రన్నరప్​గా నిలిచిన సాయి ప్రణీత్ జపాన్​కు చెందిన కెంటా నిషిమోటోతో పోటీపడనున్నాడు. భుజం గాయంతో ఇండోనేసియా ఓపెన్​కు దూరమైన సమీర్ వర్మ తొలిరౌండ్​లో డెన్మార్క్​కు చెందిన ఆండెర్స్ ఆన్టోన్సెన్​తో తలపడనున్నాడు.

పురుషుల డబుల్స్​లో సాత్విక్ - చిరాగ్ జోడి ఇంగ్లాండ్​కు చెందిన మార్కస్ - క్రిస్ ద్వయాన్ని ఢీ కొట్టనుంది. మహిళల డబుల్స్​లో - సిక్కిఅశ్విని పొన్నప్ప రెడ్డి జోడి మలేసియాకు చెందిన ఫే - నూర్​తో పోటీపడనుంది.

ఇది చదవండి: మహిళల టెన్నిస్​ ర్యాంకింగ్స్​ విడుదల

ABOUT THE AUTHOR

...view details