డ్రాప్‌లు లేవు అంతా పిన్‌డ్రాప్ సైలెన్సే.. వ్యాలీ లేదు అంతా ఖాళీనే.. రాకెట్ ఆడక.. షటిల్ ఎగరక చాలా రోజులైంది. కరోనా వైరస్ దెబ్బకు షట్లర్లందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఎప్పుడెప్పుడు మళ్లీ శిక్షణా కేంద్రాలు తీస్తారా? అని వాళ్లు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వీరిలో తెలుగమ్మాయి, అగ్రశ్రేణి డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి కూడా ఉంది. క్రీడా స్టేడియాలు, జిమ్‌లను వెంటనే తెరవాలని ఆమె కోరుతోంది. శారీరక శ్రమతోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఈ స్టార్ షట్లర్ అభిప్రాయపడింది. ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలు దగ్గర పడుతున్న నేపథ్యంలో క్రీడా కార్యకలాపాలకు అనుమతివ్వాలంటూ మాట్లాడిన సిక్కి.. అనేక విషయాలు పంచుకున్నారు.
మొదట్లో బాగుంది
మూడు నెలలకు పైగా లాక్‌డౌన్ కొనసాగుతుందని ఊహించలేదు. ఆడేటప్పుడు విశ్రాంతి కావాలని అనిపించేది. ఇప్పుడేమో విశ్రాంతికి వీడ్కోలు చెప్పి ఆడాలని ఉంది. లాక్‌డౌన్‌కు ముందు ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ నుంచి రావడం వల్ల 21 రోజులు స్వీయ నిర్బంధంలోనే ఉన్నాం. అప్పుడేమీ అనిపించలేదు. ఇంట్లోనే సరదాగా గడిపాం. వంట నేర్చుకున్నా. బటర్ చికెన్, పిజ్జా, కేక్‌లు స్వయంగా చేస్తున్నా. ఆన్‌లైన్ కోర్సులు చేశాను. వెబ్ సిరీస్‌లన్నీ చూసేశా. ఇప్పుడు ఏమీ మిగల్లేదు. మెల్లగా ఫిట్‌నెస్ ప్రారంభించాం. నేను, సుమిత్ ఇంట్లో కారిడార్‌లో శిక్షణ కొనసాగిస్తున్నాం. ప్రొఫెషనల్ క్రీడాకారులకు ఇవేవీ సరిపోవు. క్రమం తప్పకుండా బ్యాడ్మింటన్ కోర్టులో సాధన ఉండాలి. అప్పుడే మ్యాచ్ ఫిట్‌నెస్ ఉంటుంది.
ఆట మొదలైంది
దాదాపు అన్ని రాష్ట్రాల్లో క్రీడల కార్యకలాపాలు మొదలయ్యాయి. స్టేడియాలు తెరిచారు. డెన్మార్క్‌లో టోర్నీలు జరుగుతున్నాయి. ఒకరినొకరు తాకే క్రీడలు కూడా మొదలయ్యాయి. కేరళ, కర్ణాటకలో అందరూ ఆడుతున్నారు. డబుల్స్ భాగస్వాములు అశ్విని పొన్నప్ప, చిరాగ్ శెట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు. పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటూ సాధన చేస్తున్నారు. ఇంతకుముందులా నిర్ణీత సమయాల్లో కాకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రాక్టీస్ సెషన్‌లు జరుగుతున్నాయి. అయితే డబుల్స్ క్రీడాకారులు ఒక్కచోట ప్రాక్టీస్ చేస్తేనే బాగుంటుంది. ఎవరికి వారు చేసే సాధనలో తీవ్రత ఉండదు.