మన దేశంలో క్రీడల ఎదుగుదలకు స్వదేశీ, విదేశీ కోచ్‌లు కలిసి పనిచేయడం ముఖ్యమని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. అయితే పూర్తిగా విదేశీ కోచ్‌ల మీదే ఆధారపడడం సరికాదని అన్నాడు. ద్వితీయ శ్రేణి విదేశీ కోచ్‌లు కేవలం ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను మాత్రమే తయారుచేయగలరని తెలిపాడు. హై పర్‌ఫార్మెన్స్ కోచ్ ఎడ్యుకేషన్ వర్చువల్ కార్యక్రమం ఆరంభోత్సవంలో గోపీచంద్ మాట్లాడాడు.
"మన క్రీడాభివృద్ధికి విదేశీ కోచ్‌లు చాలా ముఖ్యం. క్రీడల్లో మనం ఏ అంశంలో అయితే నిపుణులం కాదో ఆ విషయంలో ఆరంభంలో విదేశీ కోచ్‌ల సాయం తీసుకోవడం కొన్నిసార్లు మంచిదే. కానీ విజయవంతమైన జట్లలో కూడా కేవలం విదేశీ కోచ్‌లనే కొనసాగిస్తే మన క్రీడా విధానానికి అన్యాయం చేసినట్లే. వాళ్ల నుంచి నేర్చుకున్న తర్వాత క్రమంగా వాళ్ల ప్రాధాన్యాన్ని తగ్గించాలి. ఎందుకంటే వాళ్లు ద్వితీయ శ్రేణి ఉత్తమ ఆటగాళ్లుగానే మనవాళ్లను తీర్చిదిద్దుతారు" గోపీచంద్ చెప్పాడు.