అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌ల టోక్యో ఒలింపిక్స్ అర్హత అవకాశాలు దెబ్బతినకుండా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చర్యలు చేపట్టింది. మలేసియా, సింగపూర్ టోర్నీల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారుల కోసం బాయ్ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.
ఒలింపిక్స్ అర్హతకు ఈ రెండు టోర్నీలే చివరివి కావడం.. కరోనా తీవ్రత దృష్ట్యా భారత ప్రయాణికులపై రెండు దేశాలు నిషేధం విధించడం వల్ల సైనా, శ్రీకాంత్‌లలో ఆందోళన మొదలైంది. మే 25 నుంచి 30 వరకు మలేసియా ఓపెన్, జూన్ 1 నుంచి 6 వరకు సింగపూర్ ఓపెన్ జరుగనున్నాయి. భారత్ నుంచి పి.వి.సింధు, సైనా, సాయిప్రణీత్, శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి, సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప ఈ టోర్నీల్లో బరిలో ఉన్నారు.