తెలంగాణ

telangana

ETV Bharat / sports

విశ్వక్రీడల ముంగిట షట్లర్లకు గాయాల బెడద! - injuries

విశ్వక్రీడలు సమీపిస్తున్న తరుణంలో భారత షట్లర్లు గాయల బారిన పడటం అందరినీ కలవరపెడుతోంది. సైనా, సమీర్ వర్మ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఇండోనేసియా ఓపెన్​కు దూరమయ్యారు. అయితే త్వరలోనే వాళ్లు కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు కోచ్ గోపిచంద్.

షట్లర్లు

By

Published : Jul 20, 2019, 10:21 AM IST

2020 టోక్యో ఒలింపిక్స్​కు కచ్చితంగా ఏడాది మాత్రమే ఉంది. ఈ తరుణంలో భారత షట్లర్లను గాయాల బెడద వెంటాడుతోంది. సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ లాంటి అగ్ర క్రీడాకారులు గాయాల బారిన పడ్డారు. ఇప్పటికే సైనా, సమీర్ ఇండోనేసియా ఓపెన్​కు దూరంగా ఉన్నారు.

వచ్చే ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9వ వరకు విశ్వక్రీడలు జరగనున్నాయి.

సైనాను వెంటాడుతున్న గాయాలు..

2012 లండన్ ఒలింపిక్స్​లో కాంస్యాన్ని సొంతం చేసుకున్న సైనా ఈ సీజన్​లో టైటిల్ నెగ్గిన ఒకే ఒక్క భారత షట్లర్​గా నిలిచింది. అనంతరం అనారోగ్య కారణంగా ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్​షిప్​లో సత్తాచాటలేకపోయింది. తర్వాత కోలుకున్నా.. గాయాలు మళ్లీ తిరగబెడుతూనే ఉన్నాయి. మోకాలి గాయం మొదలు చీలమండ, నడుము, మణికట్టు సమస్యలతో ముఖ్యమైన టోర్నీలకు దూరమైంది. ప్రస్తుతం ఫిట్​నెస్ లేమితో ఇండోనేసియా ఓపెన్​లో ఆడట్లేదు. గతంలో ఈ టోర్నీలో మూడుసార్లు విజేతగా నిలిచింది సైనా.

సైనా నెహ్వాల్

భుజం నొప్పితో సమీర్​..

గత డిసెంబరులో వరల్డ్ టూర్ రన్నరప్​గా​ నిలిచిన సమీర్ వర్మ భుజం నొప్పితో ప్రస్తుతం జకార్తాలో జరుగుతున్న ఇండోనేసియా ఓపెన్​కు దూరంగా ఉన్నాడు. 2018లో సమీర్ సత్తాచాటాడు. గత ఏడాది మూడు టైటిళ్లు సాధించాడు.

మోకాలి గాయంతో శ్రీకాంత్​..

మోకాలి గాయం కావడం వల్ల మూడు రోజుల ముందు ప్రతిష్టాత్మక సుదీర్​మన్​ కప్​కు దూరమయ్యాడు శ్రీకాంత్. అనంతరం కోలుకున్న ఈ తెలుగుతేజం ఇండోనేసియా ఓపెన్​లో ఆడాడు. ఆ టోర్నీలో గాయం మళ్లీ తిరగబెట్టడం వల్ల రెండో రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు.

శ్రీకాంత్

ఒలింపిక్సే లక్ష్యంగా ప్రణయ్​..

గత ఏడాది తన కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంకు(8) సాధించిన ప్రణయ్ తర్వాత జీర్ణసంబంధిత వ్యాధి బారిన పడ్డాడు. దీనివల్ల ఈ సీజన్​లో చాలా టోర్నీలకు దూరమయ్యాడు. తర్వాత కోలుకున్న ప్రణయ్ ఒలింపిక్స్ బెర్త్​పై కన్నేశాడు. ప్రస్తుతం 31వ ర్యాంకులో ఉన్న ఈ షట్లర్ టాప్- 10లో చోటు దక్కించుకునేందుకు కృషి చేస్తున్నాడు.

ప్రణయ్

ఇలా అగ్రస్థాయి ఆటగాళ్లు గాయాల బారిన పడటం క్రీడాప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే త్వరలోనే కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు కోచ్ గోపిచంద్.

"కొంత మంది కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం కలవరే పెట్టే అంశమే. మూడు వారాల్లోగా వాళ్లు కోలుకుంటారని అనుకుంటున్నా. ప్రస్తుతం ఒలింపిక్స్ అర్హతపైనే దృష్టి పెట్టాం. విశ్వక్రీడలకు సంబంధించి ప్రణాళికను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నాం" - పుల్లెల గోపిచంద్, కోచ్​.

ఒలింపిక్స్​లో అర్హత సాధించాలంటే వరల్డ్​ ర్యాంకింగ్స్​లో మొదటి 16 స్థానాల్లో ఉండాలి. ఒక్కో దేశం సింగిల్స్ విభాగంలో పురుషుల నుంచి ఇద్దరు, మహిళల నుంచి ఇద్దరిని విశ్వక్రీడలకు పంపించే అవకాశముంది.

ఇది చదవండి: ప్రపంచకప్​లో వైఫల్యంతో కోచ్​లపై శ్రీలంక వేటు..!

ABOUT THE AUTHOR

...view details