పీవీ సింధు చిరకాల స్వప్నం, అశేష క్రీడాభిమానుల ఉత్కంఠభరిత నిరీక్షణ- రెండూ నిన్న స్విట్జర్లాండ్‌లో ఫలించాయి. వరసగా మూడోసారి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ తుది అంకానికి అర్హత సాధించిన తెలుగు తేజం, ఈసారి గురి తప్పకుండా లక్ష్యం ఛేదించి స్వర్ణం చేజిక్కించుకుంది. రెండేళ్లక్రితం ఇదే వేదికపై తనను ఓడించిన ప్రత్యర్థి నొజోమీ ఒకుహారాను తిరుగులేని ఆటతో ఉక్కిరిబిక్కిరి చేసిన సింధు ధాటిని 21-7, 21-7 తేడాతో ఒడిసిపట్టిన అద్భుత విజయం కళ్లకు కడుతుంది!
ఈ పోటీల్లో అయిదో సీడ్‌గా బరిలోకి దిగిన సింధుకు క్వార్టర్ ఫైనల్ దశలో రెండో సీడ్ తైజు యింగ్ (చైనీస్ తైపీ) రూపేణా గట్టిపోటీ ఎదురైంది. ఆ హోరాహోరీ పోరులో తొలుత వెనకబడినా పుంజుకొని కడకు జయభేరి మోగించిన భారత మేటి షట్లర్, సెమీస్‌లో మరింత నిలదొక్కుకుంది. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)ను మట్టి కరిపించి ఫైనల్లోకి దూసుకెళ్ళిన సింధుకు నిన్న పట్టిందల్లా బంగారమై కొట్టిన షాట్లెన్నో పాయింట్లు తెచ్చిపెట్టాయి. సిసలైన విజేత తాలూకు ఆత్మవిశ్వాసం ప్రత్యర్థిని ఎలా కకావికలం చేయగలదో నిన్నటి ఏకపక్ష పోటీ సోదాహరణంగా తెలియజెప్పింది!
ఆరు సంవత్సరాల క్రితం పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడి కాంస్యం గెలిచిన సింధు, మరుసటి ఏడాదీ దాన్ని పునరావృతం చేసింది. గత రెండేళ్లుగా చివరి మెట్టుపై తడబడి రజతంతో సరిపుచ్చుకొన్నా, ఈసారి సర్వశక్తులూ కేంద్రీకరించి విశ్వవిజేత హోదాలో స్వదేశానికి తిరిగి వెళ్ళాలన్న పట్టుదల ఆమె ఆటలో ఉట్టిపడింది. ప్రధాని మోదీ చెప్పినట్లు- ఇటువంటి గెలుపు కొన్ని తరాల్ని ఉత్తేజితం చేస్తుంది. 1983లో ప్రకాశ్ పదుకొణె కాంస్యం నెగ్గిన దరిమిలా ఇన్నేళ్లకు మళ్ళీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో పతకం సాధించినవాడిగా సాయి ప్రణీత్ ఒకవంక, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులెవరికీ ఇప్పటిదాకా సాధ్యంకాని పసిడిని కొల్లగొట్టిన సింధు మరోపక్క- తెలుగు తల్లి ముద్దుబిడ్డలుగా యావత్ భారతావని జేజేలందుకుంటున్నారు!
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అయిదు పతకాలు అందుకున్న ఘనత ఇప్పటివరకూ చైనా దిగ్గజం జాంగ్ నింగ్‌కే పరిమితమైంది. ఆ రికార్డును సమం చేసిన ఖ్యాతి నేడు సింధు ఖాతాలో జమపడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మేటి గురువు గోపీచంద్ శిష్యరికంతో రాటుతేలిన సింధు సహజసిద్ధ ప్రతిభాపాటవాలను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ వేదికలపై రజతాలతోపాటు రియో ఒలింపిక్స్‌లో వెండి ప్రదర్శన ఎలుగెత్తి చాటినా- కీలక స్పర్ధల్లో ఆఖరి దశలో విఫలమవుతుందన్న విమర్శలు ఇన్నాళ్లూ వెన్నాడాయి. వాటన్నింటికీ ఒకుహారాపై సింధు నిన్న జరిపిన పదునైన దాడే సరైన సమాధానం.
2013లోనే అత్యంత పిన్నవయస్కురాలైన ఛాంపియన్‌గా నిలిచిన రచనోక్ ఇంతనాన్ (థాయ్‌లాండ్)ని ఈసారి సెమీస్‌లో పరాజయం పాల్జేసిన ఒకుహారా నిర్ణయాత్మక ఫైనల్‌లో ఓ పట్టాన కొరుకుడు పడదన్న అంచనాలు ఒక దశలో భయపెట్టాయి. గత నెలలో ఇండొనేసియా ఓపెన్ పోటీల్లో ఒకుహారాను కంగుతినిపించిన సింధు నిన్నా అదే ఒరవడి కొనసాగించి భారతీయ క్రీడాప్రతిభ వేరెవరికీ తీసిపోదని సగర్వంగా నిరూపించింది!