ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తుదిపోరుకు అర్హత సాధించడం సింధూకిది మూడోసారి. ఈ టోర్నీలో ప్రకాశ్ పదుకునే కాంస్యం నెగ్గాక మరో పతకం కోసం మూడు దశాబ్దాలు ఎదురుచూడాల్సి వచ్చింది. 2013లో కాంస్యం నెగ్గడం ద్వారా సింధు ఆ నిరీక్షణకు తెరదించింది. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు పతకాలు గెలిచినా స్వర్ణం సాధించకపోవడం లోటుగా చెప్పవచ్చు. చివరి రెండు సీజన్లలోనూ ఫైనల్ చేరినా తుది పోరులో బోల్తా పడి రజతంతో సరిపెట్టుకుంది సింధు.
నేడు జరగనున్న ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరతో తలపడనుంది సింధు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క పతకం గెలవలేదు. ఈ కసిని తుదిపోరులో ప్రదర్శించి ఎలాగైనా స్వర్ణం సాధించాలని భావిస్తోంది.
ఒకుహరపై సింధుదే పైచేయి
ఇప్పటివరకు ఒకుహరతో జరిగిన మ్యాచ్‌ల్లో 8-7 తేడాతో ఆధిక్యంలో ఉంది సింధు. 2017 ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఒకుహర చేతిలోనే ఓడింది. తొలిసారి ఆ ప్రతిష్టాత్మక పోరులో స్వర్ణం గెలుద్దామనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్‌కు నిరాశే మిగిల్చింది జపాన్ క్రీడాకారిణి. మళ్లీ రెండేళ్ల తర్వాత సింధును అడ్డుకోవడానికి సిద్ధమవుతోంది. ఈసారి ఒకుహరను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది సింధు.
ఫైనల్ ఫోబియా
ప్రపంచ స్థాయి వేదికలపై సత్తా చాటే సింధు.. ఫైనల్లో మాత్రం బోల్తా పడుతోంది. కొన్నేళ్లుగా ఎన్నోసార్లు తుదిపోరులో ఓడి నిరాశను మిగిల్చింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు మరోసారి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సింధు భావిస్తోంది.
ఇవీ చూడండి.. ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు పీవీ సింధు