తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సైనా.. అకాడమీని వీడడం కలచివేసింది'

తన ప్రియ శిష్యురాలు సైనా నెహ్వాల్ అప్పట్లో గోపీచంద్ అకాడమీని వీడడం గురించి స్పందించాడు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్. ఈ సంఘటన ఎంతో కలచివేసిందని చెప్పుకొచ్చాడు.

Pullela
సైనా

By

Published : Jan 13, 2020, 7:49 AM IST

ప్రముఖ జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ సహజంగా తన భావోద్వేగాలను ఎక్కడా బయటపెట్టడు. అలాంటి వ్యక్తి ఈ మధ్యే ఒక చేదు నిజాన్ని వెల్లడించడం ఆసక్తిగా మారింది. తన ప్రియ శిష్యురాలు సైనా నెహ్వాల్‌ అప్పట్లో గోపిచంద్‌ అకాడమీని వీడడం కలచివేసిందన్నాడు. ఈ విషయంలో తన గురువు ప్రకాశ్‌ పదుకొణె కనీసం సైనాతో తన గురించి సానుకూలంగా మాట్లాడకపోవడం మరింత బాధించిందని తెలిపాడు. గోపీచంద్‌పై ప్రముఖ క్రీడా జర్నలిస్ట్‌ బోరియా మజుందార్‌ 'డ్రీమ్స్ ఆఫ్‌ ఎ బిలియన్‌' అనే పుస్తకం రాస్తున్నాడు. ఈ సందర్భంగా గోపిచంద్‌.. సైనా వివాదాన్ని మజుందార్‌తో పంచుకున్నాడు.

బిట్టర్‌ రైవల్రీ అనే ఛాప్టర్‌లో గోపీ ఏమన్నాడంటే.. "2014లో సైనా నా అకాడమీని వీడుతుంటే అత్యంత సన్నిహితమైన వ్యక్తి దూరమైనట్టు అనిపించింది. ఆమెను వెళ్లొద్దని అంతకుముందే చాలా బతిమిలాడాను. ఇతరుల ప్రభావంతో ఆమె అప్పటికే వెళ్లడానికి నిర్ణయించుకుంది. నేను ఆపలేకపోయా. తను వెళ్లడం ఇద్దరికీ మంచిది కాదని తెలుసు. అదే సమయంలో వేరే క్రీడాకారులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉండేది. పీవీ సింధు 2012- 2014 కాలంలో అత్యుత్తమంగా రాణించింది. అయినా నేనెప్పుడూ సైనా నెహ్వాల్‌ను విస్మరించలేదు. ఈ విషయాన్ని ఆమెకు సరిగ్గా చెప్పలేకపోయానేమో. అలాగే నేను రోల్‌ మోడల్‌గా భావించే ప్రకాశ్‌ సర్‌.. సైనాతో మాట్లాడాల్సింది. వాళ్లెందుకు మాట్లాడుకోలేదో నాకు తెలీదు. పైగా సైనాని హైదరాబాద్‌ వీడమని బలవంతం చేశారు. ప్రకాశ్‌ సర్‌ నా గురించి ఎందుకు తనతో చర్చించలేదో ఇప్పటికీ అర్థంకాని విషయంగా మిగిలిపోయింది" అని గోపీ చెప్పుకొచ్చాడు.

సైనా.. గోపీచంద్‌ అకాడమీ వీడాక 2016 రియో ఒలింపిక్స్‌లో ఘోర పరాజయం పాలైంది. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. "సైనా జీవితంలో అవి గడ్డు రోజులు. 2016 ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లోనే వెనుతిరిగింది. దాని వల్ల కొన్ని సంవత్సరాల సాధన వృథా అయింది. ఆ సమయంలో గోపీ సర్‌ సైనాతో లేరు. తర్వాత గాయమై సర్జరీ చేయించుకుంది. అప్పుడేం చేయాలో ఆమెకు అర్థమయ్యేది కాదు. తర్వాత 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకం గెలిచాక గోపీ సర్‌ వద్దకెళ్లి క్షమాపణ చెప్పాలని అనుకుంది" అని ఆమె భర్త పారుపల్లి కశ్యప్‌ నాటి సంగతులను వెల్లడించాడు. కాగా, ఈ పుస్తకాన్ని హార్పర్‌ కొలిన్స్‌ పబ్లికేషన్స్‌ జనవరి 20న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.

ఇవీ చూడండి:కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న మలింగ

ABOUT THE AUTHOR

...view details