తెలంగాణ

telangana

ETV Bharat / sports

పుల్లెల​ గోపీచంద్​కు జీవన సాఫల్య పురస్కారం

ద్రోణాచార్య అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్‌ ప్రధాన కోచ్​ పుల్లెల గోపీచంద్‌కు అరుదైన గౌరవం లభించింది. దేశంలో బ్యాడ్మింటన్‌ అభివృద్ధికి అతడు చేసిన కృషిని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) గుర్తించింది. అందుకుగానూ గోపీకి.. 2019 ఐఓసీ 'జీవన సాఫల్య పురస్కారం' తాజాగా ప్రకటించింది.

By

Published : Feb 9, 2020, 7:46 AM IST

Updated : Feb 29, 2020, 5:20 PM IST

Pullela Gopichand
బ్యాడ్మింటన్​ కోచ్​ గోపీచంద్​కు జీవనసాఫల్య పురస్కారం

పుల్లెల గోపీచంద్‌.. పరిచయం అక్కర్లేని పేరు. భారత బ్యాడ్మింటన్‌లో భవిష్యత్‌ ఛాంపియన్లను తయారు చేసే కేరాఫ్‌ అడ్రస్‌. తాజాగా అతడు అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. దేశంలో బ్యాడ్మింటన్‌ అభివృద్ధికి అతడు చేసిన కృషిని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) గుర్తించింది. ఫలితంగా 2019 ఐఓసీ జీవన సాఫల్య పురస్కారం తాజాగా ప్రకటించింది.

ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారత కోచ్‌గా ఘనత సాధించాడు గోపీచంద్‌. పురస్కారం వరించడంపై తాజాగా ఆనందం వ్యక్తం చేశాడు ఈ స్టార్​ కోచ్​.

"నాకు లభించిన పెద్ద గుర్తింపుగా భావిస్తున్నా. ఈ పురస్కారం వస్తుందని ఊహించలేదు. నన్ను మేటి కోచ్‌గా ఐఓసీ గుర్తించడం ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ క్రీడాంశాల్లో ఎందరో ప్రముఖ కోచ్‌లున్నారు. వారందరినీ కాదని నన్ను ఈ అవార్డు వరించడం గొప్పగా ఉంది. ఈ పురస్కారం భారత బ్యాడ్మింటన్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇందుకు భారత ఒలింపిక్‌ సంఘానికి కృతజ్ఞతలు".

-- గోపీచంద్​, బ్యాడ్మింటన్​ కోచ్​

తొలి అడుగు...

2001లో 'ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌' గెలిచిన గోపీ.. నిస్వార్థమైన ఆలోచనతో అకాడమీని స్థాపించాడు. తనకు లేని సదుపాయాలను భవిష్యత్‌ తరాలకు అందిస్తే.. దేశం గర్వించదగ్గ ఛాంపియన్లు తయారవుతారని బలంగా నమ్మాడు. అలా 2001లో వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఏడేళ్లు పట్టింది. ఎంతో కష్టపడి ప్రపంచస్థాయి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి.. సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్‌, కిదాంబి శ్రీకాంత్‌ వంటి ఛాంపియన్లను తీర్చిదిద్దాడు.

బ్యాట్‌ పట్టాల్సినోడు.. రాకెట్‌ పట్టాడు:

1973 నవంబర్‌ 16న జన్మించిన పుల్లెల గోపీచంద్‌.. చిన్నప్పుడు క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా సోదరుడి ప్రోద్బలంతో బ్యాడ్మింటన్‌ బాట పట్టాడు‌. హైదరాబాద్‌లోనే చదువు పూర్తి చేసి 1990-91లో ఇండియన్‌ కంబైన్డ్‌ యూనివర్సిటీస్‌ బ్యాడ్మింటన్‌ జట్టుకు కెప్టెన్‌గా చేశాడు. ఎస్‌.ఎం. అరిఫ్‌, ప్రకాశ్‌ పదుకొణెల వద్ద శిక్షణలో రాటుదేలాడు. తర్వాత బెంగుళూరు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. నిరంతర సాధనతో 1996 నుంచి 2000 వరకు వరసగా ఐదేళ్లు జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. 1998 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల జట్టు విభాగంలో రజతం, పురుషుల సింగిల్స్‌ విభాగంలో కాంస్యం సాధించాడు. ఈ క్రమంలో 1999లో 'తౌలోస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌', 'స్కాటిష్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌'లు సొంతం చేసుకున్న గోపీచంద్‌.. 2001లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ను సాధించి చరిత్ర సృష్టించాడు. 1980లో తన గురువు ప్రకాశ్‌ పదుకొణె తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు.

గోపీచంద్​

ఇల్లు తాకట్టు పెట్టి అకాడమీ నిర్మాణం:

సరైన శిక్షణ సౌకర్యాలు లేకపోయినా గోపీచంద్‌ అలుపెరుగని యోధుడిలా పోరాడాడు. గాయాలు వెంటాడినా, కష్టాలు ఎదురైనా అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డాడు. భారత బ్యాడ్మింటన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లి.. 'గోపీచంద్‌ అకాడమీ'ని స్థాపించాడు. ఈ క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అకాడామీ స్థాపనకు ప్రభుత్వం భూమి ఇచ్చినా.. దాని నిర్మాణానికి ఆర్థిక వనరులు ఆయన వద్ద లేవు. సహాయం చేస్తామన్న వాళ్లు ముఖం చాటేసినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగు వేశాడు. ఈ నేపథ్యంలో ఇంటినే తాకట్టు పెట్టి అకాడమీ నిర్మాణం చేపట్టాడు. తర్వాత, ఓ వ్యాపారవేత్త ఆర్థికంగా చేయూతనందించడంతో 2008లో గోపీచంద్‌ అకాడమీ ప్రారంభమైంది. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ తదితర ఛాంపియన్లంతా అతడి శిష్యులే. వీరంతా ఆయన అకాడమీలో శిక్షణ పొందారు. 2012 సమ్మర్‌ ఒలింపిక్స్‌లో సైనా కాంస్యం, 2014 చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో కిదాంబి శ్రీకాంత్‌ ఛాంపియన్‌, 2014 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పారుపల్లి కశ్యప్‌ స్వర్ణం, 2016 ఒలింపిక్స్‌లో సింధు రజతం.. ఈ పతకాలు గోపీ కోచింగ్​కు సాక్ష్యాలు.

సింధు, సైనాలతో కోచ్​ గోపీచంద్​

గోపీకి వచ్చిన అవార్డులు:

>> 1999లో అర్జున అవార్డు
>> 2001లో రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్నా అవార్డు
>>2005లో పద్మశ్రీ
>>2009లో ద్రోణాచార్య అవార్డు
>>2014లో పద్మ భుషణ్‌

Last Updated : Feb 29, 2020, 5:20 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details