కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే దానికి కచ్చితమైన ఉదాహరణ ఆమె. ఎంతో మంది ప్రత్యేక అవసరాల వారికి నిలువెత్తు నిదర్శనం. రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా రాకెట్ పట్టి బరిలోకి దిగారు. తన పట్టుదల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మొండిగా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే పారా బ్యాడ్మింటన్ విభాగంలో పతకాల జోరు కొనసాగించారు. చివరికి 2019లో ఈ విభాగంలోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌గా అవతరించి శభాష్ అనిపించుకున్నారు. ఆమె పేరే మానసి జోషి. సరిగ్గా నిలుచోడానికి కాలు లేకున్నా పరిస్థితులపై పోరాడి నిజమైన విజేతగా నిలిచారు. ఆ పోరాట లక్షణమే ఆమెకు అరుదైన గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవల బార్బీడాల్ 'షీ'రోస్ సంస్థ మానసి బొమ్మను పోలిన ఓ మోడల్‌ను విడుదల చేయగా ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అసలీ మానసి ఎవరు.. ఆమె కథ ఏంటో తెలుసుకుందాం.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ఆరంభం
మానసి తండ్రి గిరీష్ చంద్ర జోషి. ముంబయిలోని బాబా అటామిక్ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. స్వతహాగా ఆయనో బ్యాడ్మింటన్ ప్లేయర్. తన కూతురుకు ఆరేళ్ల వయసులోనే ఈ ఆటపై మక్కువ ఏర్పడడం వల్ల ఆమె చేతికి రాకెట్ అందించారు. దాంతో చిన్ననాటి నుంచే మానసి చదువులో ముందుంటూనే క్రీడలపైనా ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత ముంబయిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో కెరీర్ ఆరంభించారు.
ఆ రోడ్డు ప్రమాదంతో దశ తిరిగింది
ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే మానసి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 2011 డిసెంబర్‌లో ఒకరోజు తన ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆమె కిందపడిపోవడం వల్ల ఎడమకాలిపై నుంచే లారీ వెళ్లింది. ఆ క్షణంలో ఎవరైనా వెంటనే స్పందించి ఉంటే ఆమె జీవితం మరోలా ఉండేదేమో! కానీ, ఆస్పత్రికి వెళ్లేసరికి ఆలస్యమైంది. సరైన చికిత్స అందేసరికి సాయంత్రమైంది. వైద్యులు ఎంత కష్టడినా చివరికి ఫలితం లేకుండాపోయింది. 45 రోజుల పాటు ఎన్ని చికిత్సలు చేసినా ఇంటికి వచ్చేసరికి ఆమె ఎడమకాలు కోల్పోయ్యారు. ఇంటికి వచ్చాక అద్దంలో చూసుకుని బాధపడ్డారు. అలా ఉంటే లాభం లేదనుకుని కఠిన పరిస్థితులను అధిగమించాలని ప్రయత్నించారు.
శిక్షణకు పుల్లెల గోపీచంద్ అకాడమీకి
ఇంటికి వచ్చాక మానసి నడవడానికి ఓ ప్రోస్థెటిక్ కాలును ఏర్పాటు చేసుకున్నారు. దాంతో తన చిన్ననాటి వ్యాపకమైన బ్యాడ్మింటన్‌పై మనసుపడి మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తన తండ్రితో కలిసి సాధన చేసేవారు. ఈ క్రమంలోనే ఓ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రోత్సాహంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆమె ఇప్పుడు పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా విశేషంగా రాణిస్తున్నారు. ఎన్నో కష్టాలకోర్చి 2015 నుంచి 2019 వరకు వివిధ పతకాలు సాధించారు. ఈ ఆటతో తనకంటూ మరో జీవితం ఉందని తెలుసుకుని ఛాంపియన్‌గా మారారు. ఈ నేపథ్యంలోనే 2018లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి అత్యుత్తమ శిక్షణ తీసుకున్నారు. గోపీ ఆధ్వర్యంలో మెరుగ్గా రాణించి 2019 బాసెల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. తోటి భారత క్రీడాకారిణి పారుల్ పార్మాను ఓడించి సత్తా చాటారు.
మానసి జోషి విజయగాథను తెలుసుకున్న బార్బీడాల్ షీరోస్ సంస్థ ఆమెకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. తన పోలికలతో ఒక మోడల్ బొమ్మను రూపొందించి అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా స్థానం కల్పించింది. దాంతో ఎంతో మంది అమ్మాయిలకు, తనలాంటి ప్రత్యేక అవసరాలున్న వారికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు మానసి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె సామాజిక మాధ్యమాల్లో సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమ విద్యతో పాటు ఇతర కళలను ప్రోత్సహిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రతి ఒక్కరూ తాము సాధించాలనుకున్నది నెరవేర్చుకుంటారని తెలిపారు.
గతేడాది స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించి.. ఆ తర్వాత మీరు టైమ్ మ్యాగజైన్‌కు చెందిన 'నెక్స్ట్ జనరేషన్ లీడర్స్' కవర్‌పేజీలో ఉన్నారు. మీ జీవితంలో గత రెండేళ్ల ప్రయాణాన్ని ఎలా చూస్తారు?
నా జీవితంలో గడచిన రెండేళ్ల ప్రయాణం బ్యాడ్మింటన్‌పై పూర్తి ఏకాగ్రతతో చాలా పట్టుదల, కృషితో సాగింది. గతేడాది ఆగస్టులో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించా. ప్రపంచ టైటిల్ తర్వాత అనేక సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నా. కానీ, కరోనాకు ముందు సరైన ఫలితం వచ్చింది. పెరూ పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్‌లో కాంస్యం సాధించా. ఆ తర్వాత సింగిల్స్ ఆడటం పూర్తిగా ఆపేశాను.
నేను పారాలింపిక్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌కు అర్హత సాధించడం కోసం దృష్టి పెట్టా. కరోనా మహమ్మారి వల్ల కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమయ్యా. ఈ విశ్రాంత సమయంలో కొత్త వాటిని నేర్చుకోవడానికి దృష్టిసారించా.
మీకు దక్కిన కొత్త గుర్తింపునకు అర్థం ఏమిటో మాకు చెప్పగలరా?