నేపాల్లో జరగనున్న దక్షిణాసియా క్రీడల(శాగ్) కోసం భారత బ్యాడ్మింటన్ జట్టు ఎంపికపై డబుల్స్ షట్లర్ ప్రజక్తా సావంత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ప్రాతిపదికన ఆటగాళ్లను తీసుకున్నారో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. దేశవాళీలో కూడా ఆకట్టుకోని షట్లర్లను ఎంపికచేశారని భారత బ్యాడ్మింటన్ సంఘాన్ని(బాయ్) నిలదీసింది.
"దక్షిణాసియా క్రీడల కోసంభారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లను అనధికారికంగా తీసుకున్నారా? నేపాల్‌కు వెళ్లబోతున్నట్ల ఆటగాళ్లు వారి ఫేస్బుక్, ఇన్ స్టా ఖాతాల్లో పోస్టులు పెట్టారు. బాయ్ ఏ ప్రాతిపదికన వారిని ఎంపిక చేసింది?" -ప్రజక్తా సావంత్, షట్లర్.
జట్టులో శిఖా గౌతమ్, అశ్వినిని తీసుకోకపోవడం అన్యాయమని ట్వీట్ చేసింది.
"ఆటగాళ్ల ఎంపికలో మళ్లీ మళ్లీ అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళల జాతీయ డబుల్స్ టోర్నమెంట్లోనూ సత్తాచాటిన వారిని ఈ పోటీల్లో ఎంపిక చేయలేదు. జట్టును అధికారికంగా ప్రకటించకుండా టోర్నమెంట్లకు పంపడంపై బాయ్, మీడియా ఏం చేస్తుంది? గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్నవారినే జట్టులోకి తీసుకుంటారా? దేశవాళీలో కూడా ఆడని వారిని ఎంపిక చేస్తారా? బాయ్ సమాధానం చెప్పాలి." - ప్రజక్తా సావంత్, షట్లర్
శాగ్ అధికారిక వెబ్సైట్లో నమోదైన వివరాల ప్రకారం 11 మంది సభ్యులు గల భారత జట్టులో గర్గ్, మేఘనా జక్కంపూడి, అనుష్కా పారిక్ చోటు దక్కించుకున్నారు. అయితే జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ గెల్చుకున్న శిఖా గౌతమ్, అశ్విని భట్‌కు స్థానం లభించలేదు. ఈ పోటీల్లో బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ ఆదివారం ప్రారంభం కానుంది. షట్లర్ల వ్యక్తిగత షెడ్యూల్ డిసెంబరు 3 నుంచి ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: 4 వికెట్లు 402 పరుగులు.. పాక్ బౌలర్ చెత్త రికార్డు