తెలంగాణ

telangana

Saina: ఒలింపిక్స్ ఆశలు ఆవిరి.. సైనా రిటైర్మెంటేనా?

By

Published : Jun 17, 2021, 2:29 PM IST

Updated : Jun 17, 2021, 2:38 PM IST

భారత బ్యాడ్మింటన్​ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించుకుంది సైనా నెహ్వాల్. మహిళల సింగిల్స్​లో ఎన్నో ఘనతల్ని సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. కానీ టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్​పై విశ్లేషణ మీకోసం.

saina
సైనా నెహ్వాల్

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్​.. టోక్యో ఒలింపిక్స్​ ఆశలు ఆవిరయ్యాయి. ఒలింపిక్స్​కు ముందు బ్యాడ్మింటన్​లో షెడ్యూల్​కు మించి ఎలాంటి టోర్నీలు ఉండవంటూ.. ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్​కు ముందు ఉన్న చివరి అర్హత టోర్నీ సింగపూర్​ ఓపెన్​ రద్దు కావడం వల్ల సైనా ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. కరోనా సంక్షోభం కారణంగా ఒలింపిక్స్​కు ముందు జరగాల్సిన మూడు పెద్ద టోర్నీలైనా ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్​లు రద్దయ్యాయి. పైగా ఆటగాళ్ల ర్యాంకుల్లోనూ ఎటువంటి మార్పులు జరగలేదు. దీంతో సైనా టోక్యో ఆశలు గల్లంతయ్యాయి. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న ఈమె భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు అందరిలోనూ మెదిలే ప్రశ్న.

21వ శతాబ్దం స్టార్ క్రీడాకారిణి

సైనా నెహ్వాల్ తన కెరీర్​లో 637 మ్యాచ్​లు ఆడి 437 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. అంటే ఆమె విజయశాతం 60కి పైగా ఉంది. అలాగే 11 సూపర్ సిరీస్​ టైటిళ్లూ గెలిచింది. బ్యాడ్మింటన్​లో ఉద్ధండులుగా పిలవబడే చెనా, జపాన్, థాయ్​లాండ్​కు చెందిన క్రీడాకారులను మట్టికరిపించి భారత పతాకాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత సైనాది. ఆమె రాకతో భారత బ్యాడ్మింటన్ రూపురేఖలే మారిపోయాయి. ఎన్నో విజయాలు, మరెన్నో ఘనతలు, ఒలింపిక్స్, ప్రపంచ సిరీస్​ వంటి పోటీల్లో పతకాలతో సైనా కెరీర్​ ఎంతో ఘనంగా సాగింది. కానీ ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించలేకపోయిందీ క్రీడాకారిణి. ఈ నేపథ్యంలో 21 శతాబ్దంలో స్టార్ షట్లర్​గా గుర్తింపుపొందిన సైనా.. తర్వాతి అడుగు ఎటువైపు. అసలు తన కెరీర్​ను కొనసాగిస్తుందా? లేక త్వరలోనే ఆటకు గుడ్​బై చెబుతుందా? అన్నది అసలు ప్రశ్న.

సైనా నెహ్వాల్

శిఖారాగ్రాన సైనా

2008 చైనాలో జరిగిన ఒలింపిక్స్​కు అర్హత సాధించిన సైనా.. ఈ పోటీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. కాగా, ఈ మెగాటోర్నీకి ముందు జరిగిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్​లో స్వర్ణ పతకం సాధించి అందరినీ తనవైపు తిప్పుకొంది. ఈ పోటీల్లో ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి సయాక సటోను వరుస సెట్లలో ఓడించింది. ఇక్కడ నుంచి సైనా కెరీర్​ స్వర్ణయుగంవైపు సాగింది. 18 ఏళ్ల వయసులోనే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు నెగ్గిన సైనా.. భారత బ్యాడ్మింటన్​ చరిత్రలో ఓ గొప్ప క్రీడాకారిణిగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేసింది. మునుపెన్నడు చూడని విధంగా మహిళల సింగిల్స్​లో భారత్​ తరఫున అనేక రికార్డులు సాధించింది.

2008 ఒలింపిక్స్​ ముగిసిన తర్వాతి ఏడాది సైనా తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గింది. జకర్తా వేదికగా జరిగిన ఇండోనేసియా ఓపెన్​ ఫైనల్లో చైనా క్రీడాకారిణి వాంగ్ లిన్​ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్​గా రికార్డు సృష్టించింది.

నాలుగేళ్ల తర్వాత భారత మహిళల బ్యాడ్మింటన్ చరిత్రలో మరో రికార్డు నెలకొల్పింది సైనా. అప్పటికే నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచి జోరు మీదున్న ఈమె.. ఆల్ ఇంగ్లాండ్​ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో స్థానం సంపాందించిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్​గా చరిత్ర సృష్టించింది. కానీ డెన్మార్క్​కు చెందిన టినె బాన్ చేతిలో ఓడిపోయింది.

2010 సింగపూర్ ఓపెన్​లో గెలిచిన సైనా ర్యాంకింగ్స్​లో టాప్​-3కి చేరుకుంది. తై జూ యంగ్, లు లన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను మట్టికరిపించిన సైనాను చూసి.. ఈమె భారత బ్యాడ్మింటన్​ ముఖ చిత్రాన్ని మారుస్తుందని అంతా భావించారు. అలాగే లండన్ ఒలింపిక్స్​లో ఆమెకు పతకం పక్కా అన్న నమ్మకాన్ని పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్న సైనా.. ఈ మెగాటోర్నీలో కాంస్యం సాధించి.. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

సైనా నెహ్వాల్

లండన్​ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తర్వాత మూడేళ్లలో మరో ఏడు సూపర్ సిరీస్​ టైటిల్స్ నెగ్గింది నెహ్వాల్. పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్ వంటి కోచ్​ల పర్యవేక్షణలో రాటుదేలింది. చైనా, స్పెయిన్, జపాన్, థాయ్​, ఇండోనేసియా ఆటగాళ్ల డిఫెన్స్​ను ఛేదిస్తూ ప్రపంచ నెంబర్​ వన్​ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

2015 ఏడాది సైనాకు మరిచిపోలేని జ్ఞాపకమని చెప్పొచ్చు. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్లో కరోలినా మారిన్​పై గెలిచి టైటిల్ సాధించింది సైనా. తర్వాత ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్​ వరకు వెళ్లి.. చివరి పోరులో మారిన్ చేతిలో ఓడిపోయింది. అనంతరం ఇండియా ఓపెన్ సమ్మిట్​లో రచనోక్​ ఇటనోన్​పై గెలిచి టైటిల్ సాధించింది. అలాగే బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానానికి చేరింది.

డౌన్​ఫాల్

క్రీడాకారులందరూ ఓ క్రమంలో అత్యున్నత స్థాయికి చేరి.. తర్వాత పడిపోతూ వస్తారు. గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న బ్యాడ్మింటన్ లాంటి ఆటల్లో ఇది సర్వసాధారణం. తన సుదీర్ఘ కెరీర్​లో 24 అంతర్జాతీయ టైటిల్స్​ (11 సూపర్ సిరీస్ టైటిల్స్) గెలిచిన సైనా.. ఏనాడు అలసిపోయినట్లుగా కనిపించలేదు. ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ గెలుపే శ్వాసగా సాగుతూ వచ్చింది. తర్వాత గాయాల బారినపడింది. భుజం, కడుపు నొప్పి, కాలు, మడిమ గాయాలతో సతమతమైంది. కానీ ఎప్పుడు దానిని సాకుగా చూపలేదు. ఆ గాయాల నుంచి కోలుకుంటూ కమ్​ బ్యాక్ ఇస్తూ వచ్చింది.

2014లో ఆస్ట్రేలియా ఓపెన్, చైనా ఓపెన్ గెలిచిన తర్వాత సైనా కెరీర్​ డౌన్​ఫాల్ మెల్లగా మొదలైంది. గాయాల కారణంగా కామన్​వెల్త్ పోటీల నుంచి తప్పుకొన్న సైనా.. తర్వాత ఇక కోలుకోవడం కష్టంగానే సాగింది. ఈ గాయాలే తన శత్రువులుగా మారాయి. 2015లో గాయాలను గెలుస్తూనే నెంబర్​వన్ ర్యాంకుకు చేరుకున్న నెహ్వాల్.. ఆపై ర్యాంకింగ్స్​లో పడిపోతూ వచ్చింది.

గాయాల కారణంగా కోర్టులో సైనా కదలిక కూడా నెమ్మదించింది. దీంతో యంగ్ ప్లేయర్ల చేతిలోనూ ఓడిపోయింది. కానీ తన పట్టుదలను మాత్రం కోల్పోలేదు.

సైనా నెహ్వాల్

2016 రియో ఒలింపిక్స్​కు ముందు సైనా మోచేయి గాయంతో ఇబ్బందిపడింది. అయితే మెగాటోర్నీలో పాల్గొనడానికే మొగ్గుచూపిన ఈ క్రీడాకారిణి అత్యంత ఘోరంగా మొదటి రౌండ్​లో ఓడి ఇంటిముఖం పట్టింది. అన్​సీడెడ్​ క్రీడాకారిణి మారియా ఉలిటినా చేతిలో 18-21, 19-21 తేడాతో ఓడింది. లండన్ ఒలింపిక్స్​లో కాంస్యం గెలిచి రియోలో పతక ఆశలు రేపిన సైనాకు ఈ ఉక్రెయిన్ అమ్మాయి చెక్ పెట్టింది. మొదటి గేమ్ అయ్యాక సైనాకు గాయం తిరగబెట్టింది. డెక్సామెథసోన్ ఇంజక్షన్ వేసుకుని నొప్పిని భరిస్తూ పోటీపడినా ఓటమి తప్పలేదు.

రియో నుంచి వచ్చాక హైదరాబాద్​లో మోచేతికి సర్జరీ జరిగింది. కానీ ఆ గాయం మాత్రం నుంచి కోలుకోలేకపోయింది సైనా. ఫిట్​నెస్​ విషయంలో యువ క్రీడాకారులతో పోటీపడలేకపోయింది. అయితే గాయాన్ని ముందే గుర్తించి ఉంటే ఆమె కెరీర్​ ఇంకొన్నాళ్లు కొనసాగి ఉండేదని విశ్లేషకుల అంచనా. కానీ ఈ విషయాంలో సైనా, ఆమె కోచ్​లు విఫలమయ్యారు.

నిర్ణయం ఎటువైపో?

కరోనా, లాక్​డౌన్​తో టోర్నీలు వాయిదాపడ్డాయి. ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. మరి ఈ సమయంలో సైనా తన ఫిట్​నెస్, గేమ్ ప్లాన్​ను మార్చుకుందా? ఈ సమయాన్ని ఆమె ఎలా సద్వినియోగం చేసుకుందన్నదాని మీదే సైనా భవిష్యత్ ఆధారపడి ఉంది. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించలేకపోయినా.. మిగతా టోర్నీల్లో సత్తాచాటి కెరీర్​ను గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి సైనా ఏం ఆలోచిస్తుంది. రిటైర్మెంటా? లేక ఆటలో కొనసాగడమా?. ఈ విషయంపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:Dhoni Six: ధోనీ కొట్టిన సిక్స్​కు గూగుల్ గుర్తింపు

Last Updated : Jun 17, 2021, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details