తెలంగాణ

telangana

ETV Bharat / sports

మలేసియా ఓపెన్​ వాయిదా.. సైనా, శ్రీకాంత్​ ఆశలు ఆవిరి!

కరోనా నేపథ్యంలో మలేసియా ఓపెన్​-2021ను వాయిదా వేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) ప్రకటించింది. దీంతో ఒలింపిక్స్​ అర్హత కోసం పోటీపడనున్న భారత షట్లర్లు సైనా నెహ్వాల్​, కిదాంబి శ్రీకాంత్​ ఆశలు గల్లంతయ్యాయి. అయితే టోర్నీ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై త్వరలోనే నిర్ణయించనున్నట్లు తెలిపింది.

Malaysia Open postponed due to surge in COVID-19 cases
కరోనా కారణంగా మలేసియా ఓపెన్​ వాయిదా

By

Published : May 7, 2021, 4:19 PM IST

Updated : May 7, 2021, 5:03 PM IST

మలేసియా ఓపెన్​(2021)ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) వాయిదా వేసింది. మే 25-30 మధ్య జరగాల్సిన టోర్నీని వాయిదా వేస్తున్నట్లు మలేసియా బ్యాడ్మింటన్​ అసోసియేషన్​(బీఏఎమ్​), బీడబ్ల్యూఎఫ్ సంయుక్తంగా ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో టోర్నీని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే మలేసియా ఓపెన్​-2021 అనే సూపర్​ 750 ఈవెంట్​ను ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​గా ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య షెడ్యూల్​ చేసింది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై త్వరలోనే బీడబ్ల్యూఎఫ్​ నిర్ణయించనుంది.

ఆశలు ఆవిరి..

మలేసియా ఓపెన్ వాయిదా పడడం వల్ల ఒలింపిక్స్​కు అర్హత సాధించాలన్న భారత షట్లర్లు సైనా నెహ్వాల్​, కిదాంబి శ్రీకాంత్​ ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించేందుకు వారికి ఇదే చివరి అవకాశం. వీరితో పాటు డబుల్స్​లో సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్పలూ అర్హత పొందాల్సిఉంది.

ఒకవేళ ఒలింపిక్స్​ ప్రారంభానికి ముందు ఈ టోర్నీ రీషెడ్యూల్​ చేస్తే ఒలింపిక్స్​కు ఆడే అవకాశం ఉంది. మరోవైపు భారత్​లో ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్లే విమానాలపై సింగపూర్​ నిషేధం విధించింది.

అయితే టోక్యో ఒలింపిక్స్​ సింగిల్స్​ విభాగంలో భారత షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్​.. డబుల్స్​లో చిరాగ్​ శెట్టి, సాత్విక్​ సాయిరాజ్​ రంకిశెట్టి అర్హత సాధించారు.

ఇదీ చూడండి:'టీ20 ప్రపంచకప్​ భారత్​లో నిర్వహించకపోవడమే మంచిది!'

Last Updated : May 7, 2021, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details