టోక్యో ఒలింపిక్స్ ముంగిట జరుగుతున్న మరో ప్రపంచ స్థాయి టోర్నీలో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మలేసియా మాస్టర్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా, సింధు రెండో రౌండ్‌కు చేరగా.. పురుషుల్లో ప్రణయ్ రాణించాడు. పతకాలు ఆశించిన శ్రీకాంత్, కశ్యప్, ప్రణీత్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు.
సైనా జోరు...
గతేడాది వరుస వైఫల్యాలు, గాయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న భారత సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్... ఈ ఏడాదిని విజయంతో ఆరంభించింది. ఈ టోర్నీలో 21-15, 21-17 తేడాతో లిన్నే టాన్( బెల్జియం)పై గెలిచింది. తొలిసారి వీరిద్దరూ తలపడగా... తెలుగమ్మాయి ఆధిపత్యం ప్రదర్శించింది. ఫలితంగా తొలి రౌండ్‌కు చేరింది సైనా నెహ్వాల్.
సింధు అలవోకగా..
ప్రపంచ ఛాంపియన్, ఆరో సీడ్ పీవీ సింధు తొలి మ్యాచ్‌లో అలవోకగా గెలిచింది. ప్రత్యర్థి ఎవజెనియా కొసెత్సయ(రష్యా)పై 21-15, 21-15 తేడాతో గెలుపొందింది. గురువారం జరగనున్న రెండో రౌండ్ మ్యాచ్‌లో అయా ఓహోరి(జపాన్)తో తలపడనుంది.
ప్రణయ్, సమీర్ అదరహో...
భారత యువ షట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్... తనకన్నా బలమైన ప్రత్యర్థిపై గెలుపొందాడు. ప్రపంచ నెం.10 కంటా సునేయమాపై 21-9, 21-17 తేడాతో గెలిచాడు ఈ 26వ ర్యాంకర్. తర్వాతి మ్యాచ్‌లో ప్రపంచ నం.1 ర్యాంకర్ కెంటో మొమోటా(జపాన్)తో తలపడనున్నాడు.
మరో యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సమీర్ వర్మ... ప్రీ క్వార్టర్స్‌కు చేరాడు. ప్రపంచ 13వ ర్యాంకర్, థాయ్‌లాండ్‌కు చెందిన కాంటపోన్ వాంగ్ఛరెన్ను 21-16, 21-15 తేడాతో ఓడించాడు సమీర్.
మొమోటా చేతిలోపారుపల్లి కశ్యప్ ఓడిపోగా, ప్రపంచ ఛాంపియన్షిప్ రజత పతక విజేత సాయి ప్రణీత్ జెమ్కే(డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మరో ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ను తొలి మ్యాచ్‌లోనే ఓడించాడు చో టైన్ చెన్(చైనీస్ తైపీ).