ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన పీవీ సింధుపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు ఎంతగా కష్టపడిందో చెప్తూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
"ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడం వెనక ఎలాంటి మర్మం లేదు. ఆమె కష్టాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి".
--ఆనంద్ మహీంద్రా, పారిశ్రామికవేత్త
ఆయన షేర్ చేసిన వీడియోలో సింధు ఎంతో కష్టపడుతూ కనిపించింది. జిమ్‌లో వివిధ వర్కౌట్లు చేసింది. హైదరాబాద్‌లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో ఆమె సాధన తీసుకున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.
ఆగస్టు 25న స్విట్జర్లాండ్ వేదికగా బాసెల్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో నొజోమి ఒకుహర(జపాన్)పై సింధు విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. టోర్నీ తర్వాత మంగళవారం హైదారాబాద్ చేరుకుంది. స్వదేశంలో అడుగుపెట్టిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. భారత్‌కు రాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజును కలిసింది. వారిద్దరూ ఆమెను దేశానికి గర్వకారణంగా అభివర్ణించారని చెప్పింది సింధు.