Kidambi Srikanth: ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు చైనా స్టార్ లిన్ డాన్. అతడిని ఓడిస్తే బ్యాడ్మింటన్ ప్రపంచాన్ని గెలిచినట్లే! శ్రీకాంత్ అదే పనిచేశాడు. శ్రీకాంత్ పేరు తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది 2014లో. ఆ ఏడాది చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో అతడి ప్రదర్శన ఓ సంచలనం. అనూహ్య విజయాలతో ఫైనల్ చేరడమే అద్భుతమంటే.. తుది పోరులో లిన్ డాన్‌ను అతడి సొంతగడ్డపైనే వరుస సెట్లలో మట్టికరిపించి ప్రకంపనలు సృష్టించాడు శ్రీకాంత్. అప్పటికి భారత పురుష షట్లర్లలో ఒక ప్రిమియర్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన తొలి ఆటగాడు శ్రీకాంతే. ఆ తర్వాత కూడా నిలకడగా ఆడుతూ.. 2015లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌నూ అతను సొంతం చేసుకున్నాడు. అయితే ఇంకో సూపర్ సిరీస్ టైటిల్ గెలవడానికి శ్రీకాంత్‌కు రెండేళ్లు పట్టింది. కానీ 2017 జూన్‌లో ఇండోనేసియా ఓపెన్ గెలిచాక అతను ఆగలేదు. ఆ ఊపులో ఇంకో వారానికే ఆస్ట్రేలియా ఓపెన్ కూడా సాధించేశాడు. ఇంకొన్ని నెలల్లోనే డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించాడు. ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించడం వల్ల ప్రపంచ బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్ పేరు మారుమోగింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ ప్రపంచ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. తర్వాతి ఏడాది నంబర్‌వన్ కూడా అయ్యాడు.
Kidambi Srikanth: ప్రపంచ బ్యాడ్మింటన్‌లో పడిలేచిన కెరటం - కిదాంబీ శ్రీకాంత్ వార్తలు తాజా
Kidambi Srikanth: ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు.. అందులో వారం వ్యవధిలో గెలిచినవి రెండు.. ఆపై కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం.. ఈ క్రమంలోనే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు.. 2017-18 మధ్య కిదాంబి శ్రీకాంత్ జోరుకు నిదర్శనాలివి. అప్పటిదాకా భారత పురుషుల బ్యాడ్మింటన్‌లో ప్రకాశ్ పదుకొనె సాధించిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్యం, గోపీచంద్ నెగ్గిన ఆల్‌ఇంగ్లాండ్ టైటిల్ గురించే మాట్లాడుకునే వాళ్లం. కానీ ఒక భారత ఆటగాడు ఈస్థాయి ప్రదర్శన చేయడం.. ప్రపంచ నంబర్‌వన్ కావడం పెను సంచలనమే. ఆ తర్వాత శ్రీకాంత్ ఇంకెన్ని సంచనాలు సృష్టిస్తాడో అని భారీ అంచనాలు పెట్టుకుంటే.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయక చూస్తుండగానే పతనమైపోయాడు. ఇక అతడి కథ ముగిసినట్లే అని అంతా అనుకుంటున్న వేళ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతక ఘనత అతడి కెరీర్‌కు ఊపిరిలూదేదే. భారత బ్యాడ్మింటన్‌లో సరికొత్త శకానికి నాంది పలికేదే.
అయితే అంచనాలు భారమయ్యాయో, గాయాలు లయను దెబ్బ తీశాయో గానీ.. శ్రీకాంత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. టైటిళ్లు గెలవడం సంగతలా ఉంచితే.. సెమీస్, ఫైనల్స్ చేరడమూ గగనంగా మారిపోయింది. ఆరంభ రౌండ్లలో, అనామకుల చేతుల్లో ఓడిపోతూ భారత అభిమానుల్ని నిరాశ పరిచాడు. ఆ సమయంలోనే మోకాలి గాయం అతడి కెరీర్‌ను మరింత వెనక్కి లాగింది. ఒక దశలో నొప్పి తీవ్రం కావడం వల్ల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తర్వాత కరోనా కారణంగా ఆటలో మరింత విరామం తప్పలేదు. పునరాగమనం చేసినా.. లయను అందుకోలేకపోయాడు. గత నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క సూపర్ సిరీస్ టైటిల్ కూడా అతను సాధించలేదు. 2018లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న అతను.. 2020లో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఇక శ్రీకాంత్ పనైపోయిందని అంతా తీర్మానించేసిన సమయంలో అతను ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మళ్లీ తన సత్తా చాటాడు. గత నెలలో హైలో ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సెమీస్ చేరినప్పుడే గాడిన పడుతున్నట్లు కనిపించాడు. ఇప్పుడు ప్రపంచ టోర్నీలో ఒకప్పటి శ్రీకాంత్‌ను గుర్తు చేస్తూ దూకుడైన ఆటతో రజత పతకం సాధించాడు. కెంటొ మొమెట సహా కొందరు అగ్రశ్రేణి ఆటగాళ్లు బరిలో లేకపోవడం శ్రీకాంత్‌కు కలిసొచ్చిన మాట వాస్తవమే. అయినా.. టోర్నీలో అతడి ప్రదర్శన చూస్తే మళ్లీ లయ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. మరి ఈ ఊపును కొనసాగిస్తూ కెరీర్లో మళ్లీ మరింత ఎత్తుకు ఎదుగుతాడేమో చూద్దాం.
ఇదీ చూడండి :భారత అండర్-19 కెప్టెన్ గా యశ్ ధుల్- జట్టు ఇదే..