అథ్లెట్లు, అథ్లెటిక్స్ కోచ్‌ల శ్రమ.. అంకితభావం స్ఫూర్తిదాయకమని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. గోపీచంద్, మిత్ర ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో 'ఖేల్ ఉడాన్' ప్రాజెక్టు అద్భుత ఫలితాలనిస్తోందని తెలిపాడు. ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్ అథ్లెట్లను గొప్పగా తీర్చిదిద్దుతున్నాడని చెప్పాడు. అథ్లెట్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రాజెక్టును మరో మూడేళ్లు పొడిగించాలని మిత్ర ఫౌండేషన్ నిర్ణయించింది.
'ఖేల్ ఉడాన్'తో అద్భుత ఫలితాలు: కోచ్ గోపీచంద్ - కోచ్ గోపీచంద్ ఖేల్ ఉడాన్
'ఖేల్ ఉడాన్' అద్భుత ఫలితాలను ఇస్తోందని చెప్పిన కోచ్ గోపీచంద్.. 'లక్ష్య' ఫౌండేషన్ దేశానికి ఆదర్శంగా నిలస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ విషయంలో 'ఈనాడు' కూడా ముందుకు రావడం శుభపరిణామమని అన్నాడు.
శుక్రవారం జరిగిన కార్యక్రమంలో గోపీచంద్, మిత్ర ఎనర్జీ ఎండీ విక్రమ్ కైలాష్ ఒప్పందాల్ని మార్చుకున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. "ఖేల్ ఉడాన్ ప్రాజెక్టు ద్వారా మూడేళ్లలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో 544 పతకాలు సాధించడం గొప్ప విషయం. మూడేళ్లుగా మిత్ర ఫౌండేషన్ అద్భుతమైన సహకారం అందిస్తోంది. ద్యుతితో సహా ఎంతోమంది క్రీడాకారులకు అండగా నిలిచింది. అథ్లెటిక్స్‌కు చేయూత అందించేందుకు 'ఈనాడు' కూడా ముందుకురావడం శుభపరిణామం. 'లక్ష్య' ప్రాజెక్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 11 కేంద్రాల్లో అథ్లెటిక్స్ శిక్షణ సాగుతోంది. మరో 9 కేంద్రాల్లో శిక్షణ మొదలవుతుంది. ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు నెలకు రూ.5000 ఉపకార వేతనం కూడా ఇవ్వనున్నారు. 'లక్ష్య' ప్రాజెక్టు దేశానికే ఆదర్శం అవుతుందనడంలో సందేహం లేదు" అని పేర్కొన్నాడు.