జకర్తా వేదికగా జరుగుతోన్న ఇండోనేసియా మాస్టర్ సూపర్ - 500 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు నిరాశే ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి మ్యాచ్‌లోనే ఓడిపోగా.. భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సౌరభ్ వర్మ పేలవ ఓటములతో ఇంటిబాట పట్టారు. పీవీ సింధు మాత్రమే విజయంతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.
ఆశలన్నీ సింధు పైనే...
మహిళల సింగిల్స్‌లో భాగంగా జపాన్ షట్లర్ అయా ఒహోరీపై 21-14, 15-21, 11-21 తేడాతో గెలిచింది పీవీ సింధు. ఇప్పటి వరకూ ఇదే ప్రత్యర్థితో 10 సార్లు తలపడిన మన తెలుగుతేజం.. అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలించింది. ఇటీవల ముగిసిన మలేసియా మాస్టర్స్‌లో క్వార్టర్ట్స్‌లో వెనుదిరిగిందిసింధు.
నిరాశపర్చిన సైనా...
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ సైనా నెహ్వాల్‌కు తొలిరౌండ్లోనే షాక్ తగిలింది. మహిళల సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి సయాక టకహషితో జరిగిన పోరులో ఆమె 21-19, 13-21, 5-21 తేడాతో ఓటమి చవిచూసింది. ఒక్క సెట్లో మాత్రమే ఆధిక్యం ప్రదర్శించింది. మిగతా రెండు సెట్లలో పూర్తిగా చేతులెత్తేసింది సైనా.
గతవారం మలేసియా మాస్టర్స్‌లోనూ సైనా క్వార్టర్స్ దశలోనే వెనుదిరిగింది. ఫలితంగా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ ముంగిట ఈ అగ్ర క్రీడాకారిణి ప్రదర్శన కలవరపరుస్తోంది.
>> పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ కాంస్య పతక విజేత బీ సాయిప్రణీత్ సహా కిదాంబి శ్రీకాంత్, సౌరభ్ వర్మలకు చుక్కెదురైంది. ప్రపంచ 12వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-18, 12-21, 14-21 తేడాతో స్థానిక ఆటగాడు షేసర్ హిరెన్ రుస్తవిటో చేతిలో ఓడాడు. ఈ పోరు గంటకు పైగా జరిగింది. ఈ సీజన్‌లో శ్రీకాంత్‌కు ఇది వరుసగా రెండో తొలిరౌండ్ ఓటమి.
>> ఎనిమిదో సీడ్ షి యు కి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణీత్ 21-16, 18-21, 10-21 తేడాతో ఓటమి చవి చూశాడు. చైనాకే చెందిన లు గ్వాంగ్ జు 21-17, 15-21, 10-21 తేడాతో సౌరభ్‌ను ఓడించాడు.
>>మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కిరెడ్డి జంట 8-21, 14-21 తేడాతో దక్షిణ కొరియా ద్వయం కో సంగ్ హ్యూన్, ఇయోమ్ హై వోన్ చేతిలో ఓడింది.