World Badminton Championship 2021: శ్రీకాంత్ అదరహో. యువ ఆటగాడు లక్ష్యసేన్‌కు నిరాశ. అనుభవాన్నంతా ఉపయోగిస్తూ సత్తా చాటిన కిదాంబి శ్రీకాంత్ కెరీర్‌లో తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో అతడు 17-21, 21-14, 21-17తో లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. ఆరంభంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన లక్ష్య.. ఆ తర్వాత వెనుకబడ్డాడు. అలసిపోయినట్లు కనిపించాడు. తొలి గేమ్‌ను కోల్పోయినా.. అద్భుతంగా పుంజుకున్న శ్రీకాంత్ మ్యాచ్‌లో పైచేయి సాధించాడు. ఫైనల్ ఆదివారం జరుగుతుంది.
నువ్వా.. నేనా
ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య సెమీఫైనల్ ఆసక్తికరంగా సాగింది. తొలి గేమ్‌లో ర్యాలీలు ఎక్కువగాసేపు సాగకున్నా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. మొదట 4-4 వద్ద స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత శ్రీకాంత్ ఆధిక్యంలోకి వెళ్లినా.. లక్ష్య పుంజుకున్నాడు. ఓ చక్కని క్రాస్‌కోర్ట్ విన్నర్, ఓ స్ట్రెయిట్ స్మాష్‌తో అలరించాడు. 7-7 వద్ద స్కోర్లు సమమయ్యాయి. విరామానికి లక్ష్య 11-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత పుంజుకున్న శ్రీకాంత్ 17-16తో ఆధిక్యం సంపాదించాడు. కానీ లక్ష్య వరుసగా ఐదు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. రెండో గేమ్‌లోనూ జోరు కొనసాగించిన అతడు ఓ దశలో 8-4తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత స్కోరు 9-6. కానీ లక్ష్య అలసిపోయినట్లు కనిపించాడు. బలంగా పుంజుకుంటూ వరుసగా ఐదు పాయింట్లు సంపాదించిన శ్రీకాంత్.. విరామానికి 11-9తో ఆధిక్యంలో నిలిచాడు. ఆధిపత్యాన్ని కొనసాగించిన శ్రీకాంత్ మూలలకు ఆడుతూ లక్ష్య మరింత అలసిపోయేలా చేశాడు. బలమైన స్మాష్‌లూ కొట్టాడు. 18-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన శ్రీకాంత్.. ప్రత్యర్థికి మరో పాయింట్ ఇవ్వకుండా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.