భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు.. 'ఈఎస్‌పీఎన్ మేటి క్రీడాకారిణి'గా ఎంపికైంది. వరుసగా మూడోసారి ఆమెను ఈ పురస్కారం వరించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి భారతీయురాలు సింధుకు 'మూమెంట్ ఆఫ్ ది ఇయర్' అవార్డూ దక్కింది. 2019కి గానూ ఈఎస్‌పీఎన్ 10 విభాగాల్లో పురస్కారాలు ప్రకటించింది.
భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి.. 'మేటి క్రీడాకారుడు’గా ఎంపికయ్యాడు. ఐదు ప్రపంచకప్ స్వర్ణాలు సాధించి, ఈ ఘనత సాధించాడు. ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్-2019లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో వ్యక్తిగతంగా 2, మిక్స్‌డ్ టీమ్‌లో 3 పతకాలతో సంచలనం సృష్టించాడు. రియో ప్రపంచకప్‌లోనూ పసిడిని ముద్దాడాడు.
స్ప్రింటర్ ద్యుతీచంద్ ‘సాహసవంత క్రీడాకారిణి’ (కరేజ్) పురస్కారం గెలిచింది. గతేడాది డిసెంబర్లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ విజేత కోనేరు హంపీ 'పునరాగమనం' (కమ్‌బ్యాక్) అవార్డుకు ఎంపికైంది. బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె 2016 నుంచి 2018 వరకు విరామం తీసుకుంది.
ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజతం అందుకున్న రెజ్లర్ దీపక్ పునియా.. 'ఎదుగుతున్న క్రీడాకారుడు' (ఎమర్జింగ్)గా ఎంపికయ్యాడు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు 'ఉత్తమ కోచ్' పురస్కారం దక్కింది.
గతేడది జరిగిన షూటింగ్ ప్రపంచకప్‌లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణాలు ముద్దాడిన మను బాకర్- సౌరభ్ చౌదరి జంటకు 'మేటి జట్టు' గౌరవం దక్కింది. బీడబ్ల్యూబీఎఫ్ పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకున్న మానసి జోషి (30) 'దివ్యాంగ అథ్లెట్’ పురస్కారానికి ఎంపికైంది. హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ (సీనియర్)కు ఈఎస్‌పీఎన్ జీవితకాల సాఫల్య గుర్తింపు లభించింది.