టోక్యోలో ఒలింపిక్ పతకమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు.. భారత షటిల్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి చెబుతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఇండియా ఓపెన్‌లో ఆడనున్న ఈ జోడీ.. తమ ఆట శైలిని మార్చుకున్నట్లు వెల్లడించింది.
కొత్త కోచ్ మాథియాస్ బో ఆధ్వర్యంలో ప్లాన్-బీని అమలు చేయనున్నట్లు తెలిపారు. మాథియాస్ కోచ్‌గా ఇంగ్లాండ్ ఓపెన్‌లో తొలి టోర్నీ ఆడిన ఈ జంట.. యూరోపియన్ శైలిలో ఆడేందుకు ప్రయత్నించింది. డెన్మార్క్ జోడీ కిమ్ ఆస్ట్రప్-ఆండెర్స్ స్కారప్పై ఓటమిని చవిచూసింది.
"మేము కొత్త తరహా శైలి ఆడటానికి ప్రయత్నిస్తున్నాం. మేం ఉత్తమంగా ఆడకపోవచ్చు. కానీ, గత టోర్నీలో వ్యూహాత్మకంగా, విభిన్నంగా గేమ్‌ను అమలుపరిచాం. టోక్యోలో మెడల్ గెలవాలంటే ప్లాన్-బీతో మేము ఆడాల్సిందే. కొత్త కోచ్ కింద ఆడనుండటం, కొత్త తరహా ప్రణాళికను అమలు చేయడం ఎప్పటికైనా సవాలే. మేము అన్ని తరహా కోణాల్లో ఆడేటంత నైపుణ్యాన్ని సాధించాం. చిన్న చిన్న తప్పిదాలను సరిదిద్దుకుంటే మేము ఇందులో విజయవంతమవుతాం" అని చిరాగ్ పేర్కొన్నాడు.