చైనా ఓపెన్‌లో సత్తాచాటని భారత షట్లర్లు కొరియా ఓపెన్‌లోనూ విఫలమవుతున్నారు. సింగిల్స్ విభాగంలో కశ్యప్ మినహా మిగతా ప్లేయర్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషుల విభాగంలో సాయి ప్రణీత్ నిరాశపర్చారు.
కశ్యప్ ఒక్కడే...
ఈ అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రదర్శన ఆశాజనకంగా లేని సమయంలో... పారుపల్లి కశ్యప్ కాస్త ఊరటనిచ్చాడు. తన ప్రత్యర్థి లూ చియా హంగ్(తైవాన్)పై గెలుపొందాడు. 21-16, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరాడు.
సైనాకూ ఓటమే...
చాలా రోజుల విరామం తర్వాత పునరాగమనంలో సత్తా చాటాలనుకున్న సైనాకు.. మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం మళ్లీ తిరగబెట్టడం వల్ల మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించింది. 24వ సీడ్ క్రీడాకారిణి కిమ్ గా యున్(దక్షిణ కొరియా)చేతిలో 21-19, 18-21, 1-8 తేడాతో ఓడిపోయింది. గత వారం చైనా ఓపెన్‌లోనూ.. తొలి రౌండ్లోనే పరాజయం చెందింది సైనా.