కరోనా కారణంగా ఒలింపిక్ అర్హత పోటీ అయిన ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వాయిదా పడింది. ప్రస్తుతం ఆ టోర్నీ నిర్వహణకు తాజాగా ప్రణాళిక రూపొందింది. డిసెంబరు 8 నుంచి 13 వరకు టోర్నీ జరుగుతుందని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజాగా ప్రకటించింది.
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ దిల్లీ వేదికగా మార్చి 24-29 వరకు జరగాల్సింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా గతంలో దీన్ని నిరవధిక వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్ టోర్నీల నిర్వహణకు కొత్త క్యాలండర్‌ను బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసింది. దీని కంటే ముందుగా హైదరాబాద్ ఓపెన్ (ఆగస్టు 11-16), సయీద్ మోదీ అంతర్జాతీయ టోర్నమెంట్ (నవంబరు 17-22) జరగనున్నాయి.
మరో ఎనిమిది టోర్నమెంట్ల నిర్వహణ తేదీలను రీషెడ్యూల్ చేసింది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్). అందులో న్యూజిలాండ్ ఓపెన్ సూపర్-300, ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000, మలేసియా ఓపెన్ సూపర్-750, థాయిలాండ్ ఓపెన్ సూపర్-500, చైనాలో వరల్డ్ టూర్ ఫైనల్స్ తేదీలనూ ప్రకటించింది.