ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్‌గా రికార్డు సృష్టించిన పీవీ సింధు తర్వాతి టోర్నీలపై దృష్టి పెట్టింది. ఈ టోర్నీలో పసిడి నెగ్గిన తర్వాత అందరి కళ్లు తనపైనే ఉంటాయని, నిలకడగా రాణించాలంటే వినూత్న వ్యూహాలతో ముందుకు వెళ్లాలని చెబుతోందీ తెలుగు అమ్మాయి.
ప్రపంచ ఛాంపియన్షిప్ నెగ్గిన తర్వాత బాధ్యత మరింత పెరిగిందని చెప్పింది సింధు.
"వరల్డ్ ఛాంపియన్ అయ్యాక అందరి కళ్లు నా పైనే ఉన్నాయి. ఈ విజయంతో నాపై మరింత ఒత్తిడి, బాధ్యత పెరిగాయి. కాబట్టి నేను ఇంకా కష్టపడాల్సి ఉంది. నా ఆటలో కొన్ని మార్పులు చేసి కోర్టులోకి వెళ్లే ప్రతి సారి వినూత్న వ్యూహాలతో బరిలో దిగాలి. ఈ గెలుపు కోసం ఐదేళ్ల నుంచి నిరీక్షిస్తున్నా. ఓడినప్పుడల్లా ఎంతో బాధపడేదాన్ని. అయితే శ్రమించడం మాత్రం ఆపలేదు. నేను ఈ స్థాయిలో ఉండడం కోసం నా తల్లిదండ్రలు ఎన్నో త్యాగాలు చేశారు" -పీవీ సింధు, భారత షట్లర్
ప్రస్తుతం ఈ నెలలో జరుగనున్న చైనా, కొరియా ఓపెన్లపైనే దృష్టిపెట్టానని చెబుతోంది సింధు.