ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే లక్షణం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నుంచి అలవర్చుకున్నానని టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ పసిడి పతక విజేత ప్రమోద్ భగత్ తెలిపాడు (pramod bhagat sachin). తాను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, అప్పటి నుంచే టీవీలో సచిన్ ఆటను చూసేవాడినని అన్నాడు. దాంతో తనకు కూడా అతడిలా ప్రశాంతంగా ఉండే లక్షణం అలవడిందని పేర్కొన్నాడు. మైదానంలో సచిన్ ఒత్తిడి జయిస్తూ ప్రశాంతంగా ఆడేవాడని గుర్తుచేశాడు.
"నేను చిన్నప్పటి నుంచే సచిన్‌ను ఫాలో అయ్యేవాడిని. అతడి ప్రవర్తన నన్ను అమితంగా ఆకట్టుకుంది. నేను కూడా అలాంటి ఆలోచనా విధానంతోనే ఆడేవాడిని. అలా ప్రశాంతంగా ఉంటూ ఆటపై శ్రద్ధ పెట్టడం నాకెంతో ఉపయోగపడింది. ఎన్నో మ్యాచ్‌ల్లో వెనుకపడిపోయాక తిరిగి పుంజుకోవడంలోనూ బాగా కలిసివచ్చింది. పారాలింపిక్స్ ఫైనల్స్‌లో నేను 4-12 తేడాతో వెనుకంజలో ఉన్నప్పుడు కూడా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నా. ప్రశాంతంగా ఆడితే మళ్లీ పుంజుకొని విజయం సాధిస్తానని భావించా"