ఆట ఏదైనా సరే.. ఈ తరం, ఆ తరం అని తేడాల్లేకుండా.. మొత్తం ఆ ఆట చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారుడెవరు అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం! ఏ ఆటగాడి విషయంలోనూ ఏకాభిప్రాయం రాదు! క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, హాకీ.. ఇలా చాలా క్రీడల్లో ఇదే పరిస్థితి! కానీ బ్యాడ్మింటన్ మాత్రం ఇందుకు భిన్నం. అందులో 'ఇతనే అత్యుత్తమం' అని అందరూ ఏకీభవించే ఓ ఆటగాడున్నాడు. అతనే.. లిన్ డాన్. కాసేపు అతడి ఆట చూసినా.. అతడి రికార్డుల లెక్క తీసినా.. ఇంకా ఏ ప్రమాణాలు తీసుకున్నా.. లిన్ డాన్ అత్యుత్తమం అని ఒప్పుకోక తప్పదు! రెండు దశాబ్దాల పాటు బ్యాడ్మింటన్ ప్రియుల్ని అలరించిన ఈ చైనా యోధుడు.. శనివారం ఆటకు వీడ్కోలు పలికాడు.
దిగ్గజ చైనా షట్లర్ లిన్ డాన్ ఆటతో అనుబంధానికి ముగింపు పలికాడు. రెండు దశాబ్దాల పాటు రాకెట్‌తో పెనవేసుకున్న జీవితానికి తెరదించాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు శనివారం సామాజిక మాధ్యమాల సాక్షిగా ప్రకటించాడు. అత్యుత్తమ ఆటతీరుతో 'సూపర్ డాన్'గా పేరు సంపాదించుకున్న షట్లర్.. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిద్దామని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా ఆ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడం వల్ల.. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న 36 ఏళ్ల అతను ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కష్టమేనని భావించి ఆటకు దూరమయ్యాడు.
"ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని చెప్పడం కష్టంగా ఉంది. 37 ఏళ్లకు దగ్గరపడ్డ నేను శారీరక సామర్థ్యం, గాయాల కారణంగా సహచర ఆటగాళ్లతో పోరాడలేకపోతున్నా. రాబోయే రోజుల్లో కుటుంబంతో మరింత సమయం గడుపుతా. కఠిన పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ పట్టుదలతో ఉండాలని నాకు నేను చెప్పుకోవడం వల్ల సుదీర్ఘ కాలం పాటు ఆటలో కొనసాగగలిగా. నాలో స్ఫూర్తిని నింపిన నా ప్రత్యర్థులకు ధన్యవాదాలు."
- లిన్ డాన్, చైనా షట్లర్
అలా 'డాన్' అయ్యాడు..
అలుపెరగని పోరాటతత్వం.. విజయం కోసం మొండి పట్టుదల.. కోర్టులో చిరుతలా కదిలే వేగం.. ప్రత్యర్థి ఎవరైనా లెక్కచేయని తత్వం.. అదరగొట్టే స్మాష్‌లు.. ఆటలో డాన్ ఆధిపత్యానికి కారణాలు. ఎడమ చేతి వాటం ఆటగాడైన అతను కొట్టే స్మాష్‌లకు ప్రత్యర్థి దగ్గర సమాధానమే ఉండదు. షటిల్ ఎక్కువ ఎత్తుకు ఎగరడమే ఆలస్యం.. అతని రాకెట్ వేగాన్ని అందుకుంటుంది.. కాళ్లు బలాన్ని తెచ్చుకుంటాయి.. అంతే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి స్మాష్ చేశాడంటే ఇక దానికి తిరుగుండదు. ఆటను చదవగల నైపుణ్యం అతనికి కలిసొచ్చే గొప్ప అంశం. ఎలాంటి పరిస్థితుల నుంచైనా పుంజుకోవాలనే పట్దుదలే అతణ్ని ఇన్నేళ్లు నడిపించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడగల ఫిట్‌నెస్.. ప్రత్యర్థిని కోర్టు నలుమూలలా తిప్పగల నైపుణ్యం అతణ్ని దిగ్గజంగా మార్చాయి. సొంతగడ్డపై ఒలింపిక్స్‌లో (2008లో బీజింగ్) తనదైన శైలి స్మాష్‌తో పసిడి సొంతం చేసుకున్న ఆ క్షణాల్ని అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఆ తర్వాత ఒలింపిక్స్‌లోనూ (2012 లండన్) అదే మాయ చేశాడు. తొమ్మిది ప్రధాన టోర్నీల్లో (ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, ప్రపంచకప్, సుదిర్మన్ కప్, థామస్ కప్, ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్స్, సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్)ల్లో ఛాంపియన్‌గా నిలిచిన ఏకైక ఆటగాడు అతనే.